Home రివ్యూస్ బాహుబలి 2 రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

బాహుబలి 2 రివ్యూFriday May 12th 2017

నటీనటులు      : ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా , రమ్యకృష్ణ తదితరులు 
సంగీతం          : ఎం ఎం కీరవాణి 
ఛాయాగ్రహణం   : సెంథిల్ కుమార్ 
నిర్మాతలు       : శోభు యార్లగడ్డ , దేవినేని ప్రసాద్ 
దర్శకత్వం       : ఎస్ ఎస్ రాజమౌళి
రేటింగ్           : 3.5/ 5
రిలీజ్ డేట్      : 28 ఏప్రిల్ 2017


 

Editor Review
2015 లో రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన బాహుబలి ది బిగినింగ్ చిత్రానికి కొనసాగింపుగా దాదాపు రెండేళ్లకు వచ్చిన రెండో భాగమే ఈ బాహుబలి ది కంక్లూజన్ . ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా బాహుబలి ని మించేలా ఉందా ? లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే . 
 
కథ
 
మాహిష్మతి రాజ్యానికి కాబోయే మహారాజు గా అమరేంద్ర బాహుబలి (ప్రభాస్ ) ని ప్రకటించిన తర్వాత పట్టాభిషేకానికి ఇంకా సమయం ఉన్నందున ఈలోపు దేశవాళీ పరిస్థితులు ,ప్రజల కష్టసుఖాలు తెలుసుకోమని చెప్పి బాహుబలి ని దేశాటన కు పంపిస్తుంది రాజమాత శివగామి ( రమ్యకృష్ణ ). రాజమాత ఆదేశంతో కట్టప్ప ని తోడుగా తీసుకొని కుంతల రాజ్యానికి వెళతాడు బాహుబలి . అక్కడ ధైర్య సాహసాలతో  పాటు సౌందర్యరాశి అయిన ఆ దేశ యువరాణి దేవసేన ( అనుష్క ) ని చూసి మొదటి చూపులోనే ప్రేమిస్తాడు బాహుబలి . అయితే దేవసేన ని బాహుబలి ఇష్టపడుతున్నాడని తెలుసుకున్న భల్లాల దేవుడు (రానా ) కసితో రగిలిపోతారు . సింహాసనం దక్కలేదు అందాల రాశి కూడా వాడి సొంతమేనా అని కుట్ర పన్ని బాహుబలి పట్ల శివగామి మనసు మారేలా చేస్తాడు భల్లాల . దాంతో రాజు కావాల్సిన బాహుబలి సైన్యాధ్యక్షుడు అవుతాడు భల్లాల రాజు అవుతాడు . మాహిష్మతి రాజ్యానికి రాజైన భల్లాల బాహుబలి ని , దేవసేన ని ఎలా ఇబ్బంది పెట్టాడు ? కట్టప్ప చేతనే బాహుబలి ని ఎందుకు చంపించాడు ? తన తండ్రి మరణానికి కారణమైన భల్లాల ని మహేంద్ర బాహుబలి ఎలా అంతం చేసాడు ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్
 
ప్రభాస్ 
రానా 
అనుష్క 
రమ్యకృష్ణ 
సత్యరాజ్ 
ఎం ఎం కీరవాణి నేపథ్య సంగీతం 
సెంథిల్ ఛాయాగ్రహణం 
భారీ విజువల్స్ 
రాజమౌళి దర్శకత్వ ప్రతిభ 
 
డ్రా బ్యాక్స్
 
తమన్నా క్యారెక్టర్ కు ప్రాధాన్యత లేకపోవడం 
 
నటీనటుల ప్రతిభ : 
 
అమరేంద్ర బాహుబలి గా మహేంద్ర బాహుబలి గా రెండు పాత్రలలో కూడా విభిన్నత చూపించి ఆకట్టుకున్నాడు ప్రభాస్ . బాహుబలి పాత్రకు ప్రభాస్ ని తప్ప మరొకరిని ఊహించుకోలేం అంత గొప్పగా నటించాడు . రాజసం , వీరత్వం , కరుణ , ప్రేమ , ధీరత్వం ప్రదర్శించి నభూతో నభవిష్యత్ అనేలా రెండు క్యారెక్టర్ లకు ప్రాణ ప్రతిష్ట చేసి నట విశ్వరూపం చూపించాడు  ప్రభాస్ . 
భల్లాల దేవుడి గా రానా కూడా క్రూరత్వాన్ని ప్రదర్శించి విలక్షణత చాటుకున్నాడు . ప్రభాస్ తో పోటీపడి నటించి బాహుబలి కి నేనే సరైన విలన్ అనిపించాడు . 
దేవసేన గా నటించిన అనుష్క మరోసారి తన కెరీర్ లో చిరస్థాయిగా నిలిచి పోయే పాత్ర పోషించింది . కుంతలరాజ్య యువరాణి గా ధైర్య సాహసాలు ప్రదర్శించే పాత్రలో మెరిసింది . అనుష్క బాహుబలి 2 లో మరింత అందంగా ఉంది . రాజసం ఉట్టిపడేలా నటించింది . 
రాజమాత శివగామి గా రమ్యకృష్ణ మరోసారి సత్తా చాటింది . రమ్యకృష్ణ ఈ పాత్రకి ఒప్పుకోవడంతో బాహుబలి స్థాయి కూడా పెరిగింది . 
కుమారవర్మ గా నటించిన సుబ్బరాజు మెప్పించాడు . అలాగే కట్టప్ప గా సత్యరాజ్ , బిజ్జల దేవుడి గా నాజర్ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు . 
 
సాంకేతిక వర్గం
 
బాహుబలి చిత్రానికి ఎం ఎం కీరవాణి నేపథ్య  సంగీతం , సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం, విజువల్ ఎఫెక్ట్స్  హైలెట్స్ గా నిలిచాయి . కీరవాణి విషయానికి వస్తే ..... రాజమౌళి కి కీరవాణి కి మంచి అండర్ స్టాండింగ్ ఉంది కాబట్టి ఆ బాండింగ్ ఏంటో ఈ సినిమా రీ రికార్డింగ్ తో మరోసారి నిరూపించాడు . నేపథ్య సంగీతం తో మరో లెవల్ కు తీసుకెళ్లాడు కీరవాణి . రీ రికార్డింగ్ అద్భుతంగా ఇచ్చిన కీరవాణి పాటలను మాత్రం అనుకున్న రేంజ్ లో ఇవ్వలేక పోయాడు . రెండు పాటలు చాలా బాగున్నాయి . 
సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం మరో హైలెట్ గా నిలిచింది . విజువల్ గా రాజమౌళి ఆలోచనలకు సరికొత్త రూపం ఇచ్చి తనదైన ముద్ర వేసాడు సెంథిల్ కుమార్ . 
విజువల్ ఎఫెక్ట్స్ : కుంతలా రాజ్యాన్ని , మాహిష్మతి రాజ్యాన్ని అందంగా రూపొందించి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసారు అద్భుతమైన విజువల్స్ తో . 
ఖర్చు కు వెనుకాడకుండా అనే పదానికి నిర్వచనం అంటే కేవలం బాహుబలి అని చెప్పకతప్పదు . రాజమౌళి విజన్ ని నమ్మి ఇంత పెద్ద మొత్తాన్ని పెట్టడానికి ముందుకు వచ్చిన నిర్మాతలు శోభు యార్లగడ్డ , దేవినేని ప్రసాద్ లను నిజంగా అభినందించాలి . 
ఇక దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి విషయానికి వస్తే ........ ఇండియన్ సెల్యులాయిడ్ కు సరికొత్త నిర్వచనం ఇచ్చాడు బాహుబలి చిత్రంతో . రాజమౌళి ఆయుధమే సెంటిమెంట్ ....... హీరోఇజం . ఎక్కడ తగ్గాలో ఎక్కడ నరాలు జివ్వు మనేలా దృశ్యం ని చూపించాలో రాజమౌళి కి తెలిసినంతగా ఎవ్వరికి తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో . తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు జక్కన్న . 
 
ఓవరాల్ గా
 
అద్భుతమైన విజువల్స్ , ప్రభాస్ , రానా , అనుష్క , రమ్యకృష్ణ ల నటన , కీరవాణి నేపథ్య సంగీతం , సెంథిల్ కుమార్ కెమెరా పనితనం అన్నింటిని మించి ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి  బాహుబలి 2 ని విజువల్ వండర్ గా తీర్చి దిద్దాడు . బాహుబలి ని చూస్తూ తెలుగు వాడిగా పొంగి పోవడం ఖాయం . 
టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD