`30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?` మూవీ రివ్యూ

`30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?` మూవీ రివ్యూ
`30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?` మూవీ రివ్యూ

న‌టీన‌టులు:  ప‌్ర‌దీప్ మాచిరాజు, అమృత అయ్యంగార్‌, శిన్నారాయ‌ణ‌, హేమ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, వైవా హ‌ర్ష‌, హైప‌ర్ ఆది, ఆటో రామ్‌ప్ర‌సాద్‌, భ‌ద్రం, జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేష్ త‌దిర‌తులు న‌టించారు.
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: మున్నా
నిర్మాత: ఎస్‌.వీ.బాబు
ఛాయాగ్ర‌హ‌ణం:  దాశ‌ర‌థి శివేంద్ర‌
సంగీతం: అనూప్ రూబెన్స్‌
ఎడిటింగ్: న‌రేష్ తిమ్మిరి
రిలీజ్ డేట్: 29-01-2021
రేటింగ్:2.25/5

బుల్లితెర‌పై యాంక‌ర్‌గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు ప్ర‌దీప్‌. ఆయ‌న తొలిసారి హీరోగా న‌టించిన చిత్రం `30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?`. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని `నీలి నీలి ఆకాశం..` పాట శ్రోత‌ల్ని విశేషంగా ఆక‌ట్టుకుంది. ఎంత‌లా అంటే పాటంత బాగుంటుంది సినిమా అని చిత్ర బృందం ప్ర‌చారం చేసుకునేంత‌. లాక్‌డౌన్‌కి ముందే గ‌త ఏడాది మార్చిలో విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ప్ర‌దీప్ మాచిరాజు తొలిసారి క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా కావ‌డం, పాట పాపుల‌ర్ కావ‌డం వంటి కార‌ణాల‌తో ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌ని అందుకునే స్థాయిలో వుందా?  లేదా అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ‌:
అర్జున్ (ప్ర‌దీప్ మాచిరాజు), అక్ష‌ర ( అమృత అయ్యంగార్‌) ఒకే కాలేజీలో చ‌దువుకుంటారు. ప‌క్క ప‌క్క ఇళ్ల‌లోనే వుంటున్నా ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌దు. అవ‌కాశం దొరికితే చాలు ఒక‌రిని ఒక‌రు టామ్ అండ్ జెర్రీలా ఆడేసుకుంటుంటారు. ఒక సంద‌ర్భంగా కాలేజీ మిత్రుల‌తో క‌లిసి అర‌కు వెళ‌తారు. అక్క‌డ కూడా ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లే. ఈ క్ర‌మంలోనే అర్జున్‌, అక్ష‌ర ఒక‌రి శ‌రీరంలోకి ఒక‌రు ప్ర‌వేశిస్తారు. అలా వారు శ‌రీరాలు మార్చుకోవ‌డానికి గ‌త జ‌న్మ కార‌ణం వుంటుంది. ఇంత‌కీ గ‌త జ‌న్మ‌లో ఏం జ‌రిగింది?.. అర్జున్‌, అక్ష‌ర గ‌త జ‌న్మ‌లో ఎవ‌రు? .. ఒక‌రి శ‌రీరాల్లోకి వెళ్లిన ఆత్మ‌లు తిరిగి వారి శ‌రీరాల్లోకి మారాయా? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టుల న‌ట‌న‌:
ప్ర‌దీప్ మాచిరాజు తొలిసారి హీరోగా న‌టించిన చిత్ర‌మిది. ఈ త‌ర‌హా క‌థ‌ల్ని ప్ర‌దీప్ భుజాన మోయ‌డం క‌ష్ట‌మే. కానీ హాస్యం, భావోద్వేగాలని ప్ర‌ద‌ర్శించే విష‌యంలో మాత్రం ప్ర‌దీప్ మంచి ప్ర‌తిభ‌ని క‌న‌బ‌రిచాడు. అమృత కూడా అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. ఇక దేహాల్లో ఆత్మ‌లు మారాక అబ్బాయిగా హావ‌భావాలు ప్ర‌ద‌ర్శించి రావ‌డం.. ఆ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల్లో మాత్రం అమృత మార్కులు కొట్టేసింది. శివ‌న్నారాయ‌ణ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, హేమ పాత్ర‌ల ప‌రిఇ మేర‌కు న‌టించారు. వైవా హ‌ర్షా, భ‌ద్రం త‌దిత‌రులు అక్క‌డ‌క్క‌డ కామెడీని పండించారు.

సాంకేతిక నిపుణులు:
సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా వుంది. ఎస్వీ బాబు నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. సినిమాని చాలా రిచ్‌గా నిర్మించి త‌న అభిరుచిన మ‌రోసారి చాటుకున్నారు. ఈ చిత్రానికి ప్ర‌ధాన బ‌లంగా నిలిచింది అనూప్ రూబెన్స్. త‌న సంగీతంతో సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచారు. నేప‌థ్య సంగీతం కూడా బాగుంది. దాశ‌ర‌థి శివేంద్ర కెమెరా ప‌నిత‌నం బాగుంది. ద‌ర్శ‌కుడు మున్నా ప‌డిన క‌ష్టం తెర‌పై క‌నిపిస్తుంది. అయితే క‌థ‌, క‌థ‌నాల‌పై మ‌రింత జాగ్ర‌త్త‌లు తీసుకుని వుంటే బాగుండేది.

తీర్పు:
`30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?` అంటూ ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్ తో స‌రికొత్త క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. కార‌ణం ద‌ర్శ‌కుడు మున్నా రాసుకున్న క‌థ‌, క‌థ‌నాల్లో బ‌లం లేక‌పోవ‌డ‌మే. పున‌ర్జ‌న్మ‌ల క‌థ‌గా ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకొచ్చిన మున్నా అనుక‌న్న స్థాయిలో త‌ను చెప్పాల‌నుకున్న పాయింట్‌ని ప్ర‌భావ‌వంతంగా చెప్ప‌లేక‌పోయాడు.