ఎట్ట‌కేల‌కు ప్ర‌దీప్ సినిమా వ‌చ్చేస్తోంది!

ఎట్ట‌కేల‌కు ప్ర‌దీప్ సినిమా వ‌చ్చేస్తోంది!
ఎట్ట‌కేల‌కు ప్ర‌దీప్ సినిమా వ‌చ్చేస్తోంది!

యాంక‌ర్ ప్ర‌దీప్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం `30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?`. ఈ చిత్రం ద్వారా స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన మున్నా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఎస్వీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత ఎస్వీబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర రిలీజ్‌ని ఎట్ట‌కేల‌కు చిత్ర బృందం తాజాగా సోమ‌వారం ప్ర‌క‌టించింది.

ఈ చిత్రాన్ని ఈ నెల 29న థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్న‌ట్టు చిత్ర చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. లాక్‌డౌన్ ప్రారంభానికి ముందు ఈ చిత్రాన్ని మార్చిలో రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన చిత్ర బృందం అనూహ్యంగా లాక్‌డౌన్ అమ‌ల్లోకి రావ‌డంతో విడుద‌ల వాయిదా వేసింది. ఆ త‌రువాత కూడా ఈ మూవీని ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తున్నారంటూ వార్త‌లు వినిపించాయి.

కానీ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న ప్ర‌దీప్ త‌న చిత్రాన్ని థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేద్దామ‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంతో నిర్మాత‌లు థియేట‌ర్ రిలీజ్ కోసం గ‌త కొన్ని నెల‌లుగా ఎదురుచూస్తున్నారు. తాజాగా థియేట‌ర్లు తిరిగి రీఓపెన్ కావ‌డం.. ఇటీవ‌ల విడుద‌లైన `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌, క్రాక్ చిత్రాలకు ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించ‌డంతో ప్ర‌దీప్ చిత్ర వర్గాలు త‌మ చిత్రాన్ని ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని `నీలి నీలి ఆకాశం..ఇద్దామ‌నుకున్నా..` పాట యూట్యూబ్‌లో ఇప్ప‌టికే 218 మిలియ‌న్ వ్యూస్ దాటి రికార్డు సృష్టిస్తోంది.