ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఆరు సినిమాలివే


ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఆరు సినిమాలివే
ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఆరు సినిమాలివే

సంక్రాంతి సీజన్ తర్వాత వారానికి ఒకట్రెండు సినిమాలు విడుదలవుతూ వస్తున్నాయి. అయితే రేపు మహాశివరాత్రి సందర్భంగా ఏకంగా ఆరు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. అయితే వీటిలో ప్రేక్షకుల దృష్టి రెండు, మూడు సినిమాల మీదే ఉంది. మరి ఆ సినిమాలేంటో ఒకసారి చూద్దామా.

1. భీష్మ : నితిన్ నటించిన ఈ చిత్రం విడుదలవుతున్న ఆరు సినిమాల్లో అత్యంత క్రేజ్ తో వస్తోన్న మూవీ. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించింది. మహతి అందించిన పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. ఇక ట్రైలర్ కూడా సూపర్ గా వర్కౌట్ కావడంతో భీష్మపై ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఓపెనింగ్స్ పరంగా కూడా ఈ చిత్రానికి ఎదురు ఉండకపోవచ్చు.

2. ప్రెజర్ కుక్కర్ : విదేశాలకు వెళ్లి చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి.. అదొక ప్రెస్టేజ్ సింబల్ అనుకునే తల్లిదండ్రుల వల్ల పిల్లలు ఎంతటి ఒత్తిడికి లోనవుతున్నారు అనే అంశాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నమే ప్రెజర్ కుక్కర్. సాయి రోనిక్, ప్రీతి అస్రాణి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సుజోయ్ అండ్ సునీల్ సంయుక్తంగా డైరెక్ట్ చేసారు. అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది.

3. వలయం : లక్ష్ చదలవాడ, దిగంగాన హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ఇంటెన్స్ థ్రిల్లర్ వలయం. బిచ్చగాడు వంటి సూపర్ హిట్ సినిమాను నిర్మించిన చదలవాడ బ్రదర్స్ సమర్పణలో వలయం సినిమా తెరకెక్కింది. సరికొత్త కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ తో అంచనాలను పెంచింది.

4. చీమ ప్రేమ మధ్యలో భామ : టైటిల్ చాలా క్యాచీగా ఉన్న ఈ సినిమా అమిత్, ఇందు జంటగా రూపొందిన ఒక ఫాంటసీ చిత్రం. శ్రీకాంత్ అప్పలరాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో గ్రాఫిక్స్, మ్యూజిక్ హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా కూడా మహాశివరాత్రి సందర్భంగా 21నే విడుదల కాబోతోంది.

5. శివలింగాపురం : తోట కృష్ణ దర్శకత్వంలో అపోలో ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన శివలింగాపురం చిత్రం కూడా రేపే విడుదల కాబోతోంది. ఇందులో ఆర్ కే సురేష్, మధుబాల జంటగా నటించారు. ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను సోషల్ మీడియాలో అమితంగా ఆకట్టుకుంది.

6. వసంతకాలం : కమల్ హాసన్, వెంకటేష్ తో ఈనాడు చిత్రాన్ని తెరకెక్కించిన చక్రి తోలేటి దర్శకత్వంలో నయనతార, భూమిక ప్రధాన పాత్రలలో తెరకెక్కించిన హారర్ మూవీ వసంతకాలం. 21న విడుదల కాబోతోన్న ఈ చిత్రం తమిళంలో తెరకెక్కిన కొలయుత్తీర్ కాలంకు డబ్బింగ్ వెర్షన్. మరి ఈ డబ్బింగ్ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.

ఈ ఆరు సినిమాల్లో ఎన్ని విజయాలు సాధిస్తాయో రేపటితో తెలిసిపోతుంది.