ర‌క్ష‌ణ కోసం కోర్టుని ఆశ్ర‌యించిన స్టార్ డైరెక్ట‌ర్‌!


A R Murugados goes Madras high court
A R Murugados goes Madras high court

త‌నకు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని  స్టార్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ మ‌ద్రాస్ హైకోర్టుని ఆశ్రించ‌డం త‌మిళ‌నాట సంచ‌ల‌నంగా మారింది. త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టించిన తాజా చిత్రం `ద‌ర్బార్‌`. లైకా ప్రొడ‌క్ష‌న్స్ అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఇటీవ‌ల జ‌న‌వ‌రి 9న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి సంక్రాంతికి విడుద‌లైన విష‌యం తెలిసిందే. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించింది. బాక్సాఫీస్ వ‌ద్ద 150 కోట్ల మార్కుని దాటిందంటూ మేక‌ర్స్ హ‌డావిడి చేశారు.

అధికారిక ట్విట్ట‌ర్ పేజీ ద్వారా ఏ రోజు క‌లెక్ష‌న్స్ ఆ రోజే వెల్ల‌డిస్తూ నానా హంగామా చేశారు. కానీ ప‌రిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా వుంది. ఈ చిత్రాన్ని అత్య‌ధిక మొత్తానికి ద‌క్కించుకున్న దాదాపు 30 నుంచి 40 మంది డిస్ట్రిబ్యూట‌ర్స్ మాత్రం భారీ స్థాయిలో న‌ష్టాల్ని తెచ్చిపెట్టింద‌ని, ఆ న‌ష్టాల‌ని ద‌ర్శ‌కుడు, హీరో, నిర్మాణ సంస్థ భ‌రించాలంటూ వారి ఆఫీస్‌ల చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ఇటీవ‌ల ఓ 35 మంది డిస్ట్రిబ్యూట‌ర్స్ మందీ మార్బ‌లంతో మురుగ‌దాస్ ఆఫీస్‌కి వెళ్లి నానా హంగామా చేశార‌ట‌.

మురుగ‌దాస్ స్టాఫ్‌ని నానా బూతులు తిట్టార‌ట‌. దీంతో ఆగ్ర‌హించిన మురుగ‌దాస్ చెన్నై క‌మీష‌నర్‌ని క‌లిసి యాక్ష‌న్ తీసుకోవాల‌ని కోరారట‌. పోలీసుల నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో విసుగుచెందిన మురుగ‌దాస్ హైకోర్టుని ఆశ్ర‌యించ‌డం సంచ‌ల‌నంగా మారింది. మురుగ‌దాస్ వాద‌న‌తో ఏకీభ‌వించిన మ‌ద్రాస్ హైకోర్టు అత‌నికి ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిందిగా చెన్నై పోలీసుల‌కు స‌మ‌న్‌లు పంపిన‌ట్టు తెలిసింది.