హీరోగా ఆది కెరీర్ ఇక ముగిసినట్టేనా?


హీరోగా ఆది కెరీర్ ఇక ముగిసినట్టేనా?
హీరోగా ఆది కెరీర్ ఇక ముగిసినట్టేనా?

ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేదా ఏదైనా బ్యాకింగ్ ఉంటే తిరుగులేదనుకుంటారు కానీ ఇక్కడ ఎవడి కెరీర్ వాడిదే. వాళ్ళ నాన్నను చూసో, పెదనాన్నను చూసో ఎవరూ అవకాశాలివ్వరు. కేవలం అది లాంచింగ్ కు మాత్రమే ఉపయోగపడుతుంది. లేదా తర్వాత రెండు, మూడు సినిమాల వరకే. దీనికి బోలెడు ఉదాహరణలు మనం ప్రస్తావించుకోవచ్చు. కృష్ణ కొడుకు రమేష్ బాబు, చిరంజీవి తమ్ముడు నాగబాబు.. ఇలా ఉదాహరణలు కోకొల్లలు. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో చేరాడు సాయి కుమార్ తనయుడు ఆది.

హీరోగా ఆదికి పెర్ఫెక్ట్ లాంచింగ్ కుదిరింది. ప్రేమ కావాలి సినిమా ద్వారా ఆదికి స్టార్ హీరో కొడుకు రేంజ్ లాంచింగ్ అది. ఆ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది తర్వాత లవ్లీ చిత్రం ద్వారా మరొక హిట్ ను త్వరగానే అందుకున్నాడు. కానీ ఆ తర్వాత నుండి ఆది కెరీర్ ఏమాత్రం బాలేదు. వరసగా ప్లాపులు అతణ్ణి చుట్టుముట్టాయి. ఒకటి తర్వాత ఒకటిగా వచ్చిన ఈ ప్లాపులతో ఆది కెరీర్ పూర్తిగా దెబ్బతింది.

మధ్యలో ఆది డబ్బులు పెట్టి చేతులు కాల్చుకున్నాడు కూడా. గరం సినిమా మధ్యలో ఆగిపోతే సాయి కుమార్ చేత డబ్బులు పెట్టించి నష్టాలు కూడా కొనితెచ్చుకున్నాడు. రీసెంట్ గా ఆది నటించిన సినిమాలైతే మరీ ఘోరం. బుర్రకథ, జోడి సినిమాలతో కనీసం పోస్టర్ ఖర్చులు కూడా తిరిగి రాబట్టుకోలేని పరిస్థితి. అయితే ఆది మాత్రం తన ఆశలన్నీ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ పై పెట్టుకున్నాడు. ఈ సినిమా కచ్చితంగా ఆడుతుందని బలంగా నమ్మాడు ఆది. కశ్మీరీ పండిట్స్ మీద తీసిన కథ కావడంతో పాట్రియాటిక్ ఫీల్ తో ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశపడ్డాడు.

అయితే ఆపరేషన్ గోల్డ్ ఫిష్ తన ఆశలన్నిటి మీద నీళ్లు చల్లింది. రివ్యూలు సరిగ్గా రాని ఈ చిత్రానికి కనీస ఆదరణ దక్కట్లేదు. అదే రోజు విడుదలైన రాజు గారి గది 3కి కూడా రివ్యూలు సరిగా రాకపోయినా ఆ చిత్రం దాదాపుగా సేఫ్ అయింది. కానీ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం ఆది చేతిలో సినిమాలు కూడా లేవు. డజనుకు పైగా ప్లాపులు ఇచ్చిన ఆదిని నమ్మి నిర్మాతలు డబ్బులు పెట్టడానికి ముందుకు వస్తారని ఊహించలేం.

సాయి కుమార్ కు ఇండస్ట్రీలో మంచి పరిచయాలే ఉన్నా కానీ తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే. సాయి కుమార్ ఉన్నాడని చెప్పి డబ్బులు పోగొట్టుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆది మళ్ళీ హీరోగా నిలదొక్కుకోవడం చాలా కష్టం. లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మారితే కెరీర్ ఏమైనా టర్న్ అవుతుందేమో.. లేదంటే ఆది కెరీర్ ఇక ముగిసినట్లే అనుకోవచ్చు.