ప్ర‌భాస్‌కు ల‌క్ష్మ‌ణుడు దొరికేశాడా?


ప్ర‌భాస్‌కు ల‌క్ష్మ‌ణుడు దొరికేశాడా?
ప్ర‌భాస్‌కు ల‌క్ష్మ‌ణుడు దొరికేశాడా?

ప్ర‌భాస్ వ‌రుస‌గా భారీ చిత్రాల్ని అంగీక‌రిస్తున్న విష‌యం తెలిసిందే. `రాధేశ్యామ్‌`లో న‌టిస్తున్న ప్ర‌భాస్ ఈ మూవీ అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్‌లో వుండ‌గానే రెండు పాన్ ఇండియా స్థాయి చిత్రాల్ని లైన్‌లో పెట్టారు. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక‌టి.. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓమ్ రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా. ఈ రెండు చిత్రాల్లో ప్ర‌స్తుతం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచిన చిత్రం ఓమ్ రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రానున్న `ఆదిపురుష్‌`. టీసిరీస్ సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తోంది.

రామాయ‌న గాధ నేప‌థ్యంలో స‌రికొత్త పంథాలో 3డీ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్ని రూపొందించ‌బోతున్నారు. దాదాపు 400 కోట్ల‌కు పైచిలుకు బ‌డ్జెట్‌తో ఈ మూవీ తెర‌పైకి రాబోతోంది. ఇందులో రావ‌ణాసురుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌బోతున్నారు. సీత పాత్ర కోసం ప‌లువురి పేర్ల‌ని పరిశీలిస్తున్నారు. ప్ర‌ధానంగా మాత్రం అనుష్క శ‌ర్మ పేరు వినిపిస్తోంది. ఇక ఈ మూవీలో అత్యంత కీల‌కంగా వుండే ల‌క్ష్మ‌ణుడి పాత్ర‌ల్లో ఎవ‌రు న‌టిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ పాత్ర‌లో త‌మిళ యంగ్ హీరో అధ‌ర్వ ముర‌ళి న‌టించ‌బోతున్న‌ట్టు తాజాగా తెలిసింది. ఇప్ప‌టికే అత‌నితో చ‌ర్చ‌లు పూర్తి చేసిన మేక‌ర్స్ త్వ‌ర‌లో అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్టు తెలిసింది. కాగా ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి ప్రారంభించాల‌ని మేక‌ర్స్ ప‌క్కాగా ప్లాన్ చేసిన‌ట్టు తెలిసింది. దీనికి సంబంధించిన డిటైల్స్‌ని అధికారికంగా త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌బోతున్నార‌ట‌.