అధీరా మేకోవ‌ర్ కాపీయేనా?


అధీరా మేకోవ‌ర్ కాపీయేనా?
అధీరా మేకోవ‌ర్ కాపీయేనా?

మ‌న వాళ్లు 80వ ద‌శ‌కం నుంచి హాలీవుడ్ సినిమాల‌ని కాపీ కొట్టేస్తూనే వున్నారు. క‌థ‌ల్ని, పాత్ర‌ల్ని, స‌న్నివేశాల్ని.. ఇక కొన్నేమో ఏకంగా సినిమాల్నే ఫ్రీగా కాపీ చేశారు కూడా. కొన్నింటిని తెలివిగా మ‌న నేటివిటీకి మార్చి తీసేశారు. `బ్ల‌డ్ స్టోన్‌` ని ఖైదీగా, `సాజ‌న్` సినిమాని `అల్ల‌రి ప్ర‌యుడు`గా, మ‌మ్మీ చిత్రంలోని ప్ర‌ధాన పాయింట్‌ని తీసుకుని `అరుంధతి`గా…ది లెజెండ్ ఆఫ్ జోరో ని ఆజాద్‌గా..ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి.

`మ‌గ‌ధీర‌` చండేరీ న‌వ‌ల కాపీ అని కొంత మంది వాదిస్తే ట్రాయ్ చిత్రంలోని స‌న్నివేశాల క‌ల‌బోత అని కొంత మంది వాదించారు. అయితే అప్పుడు ఇంత టెక్నాల‌జీ లేదు. సోష‌ల్ మీడియా లేదు. కాబ‌ట్టి తెలియ‌లేదు. కానీ ఇప్పుడు వెంట‌నే తెలిసిపోతోంది. తాజాగా `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` కోసం ఏకంగా అధీరా మేకోవ‌ర్‌నే ఓ హాలీవుడ్ సినిమాలోని క్యారెక్ట‌ర్‌ని కాపీ చేసిన‌ట్టు తెలుస్తోంది. `కేజీఎఫ్ చాప్ట‌ర్ ` సంచ‌ల‌న విజ‌యం త‌రువాత వ‌స్తున్న `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2`పై భారీ అంచ‌నాలు నెల‌కొన్న విష‌యం తెలిసిందే.

ఇటీవ‌ల సంజ‌య్ ద‌త్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అధీరా లుక్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.సంజ‌య్ లుక్  నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న `వికింగ్స్‌`లోని ప్ర‌ధాన పాత్ర మేకోవ‌ర్‌ని పోలివుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఆ పాత్ర మేకోవ‌ర్‌ని ప్ర‌శాంత్ నీల్ కాపీ చేశారంటూ విమ‌ర్శ‌లు వినిపించాయి. దీంతో ముందు జాగ్ర‌త్త ప‌డిన ప్ర‌శాంత్ నీల్ వికింగ్స్ మేకోవ‌ర్ స్ఫూర్తితో అధీరా లుక్‌ని డిజైన్ చేసిన‌ట్టు వెల్ల‌డించి త‌ప్పించుకున్నారు. య‌ష్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని అన్నీ అనుకూలిస్తే అక్టోబ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.