స‌మంత కాదంది.. అదితీ అవునంది!


స‌మంత కాదంది.. అదితీ అవునంది!
స‌మంత కాదంది.. అదితీ అవునంది!

త‌మిళ హిట్ చిత్రం `96` ఆధారంగా రూపొందిన‌ `జాను` అంతా భావించిన‌ట్టుగానే తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక‌పోయింది. దిల్ రాజు మ‌న‌సుప‌డి మ‌రీ రీమేక్ చేసిన ఈ సినిమా క‌థ‌ని రీమేక్ చేయ‌గ‌లిగానే కానీ ఆ సోల్‌ని మాత్రం మ‌ళ్లీ రిప్ర‌జెంట్ చేయ‌లేక‌పోయార‌న్న‌ది మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. ఈ రీమేక్‌లో న‌టించ‌న‌ని, దీన్ని రీమేక్ చేయ‌డం కంటే డబ్బింగ్ చేయ‌డ‌మే ఉత్త‌మ‌మని చెప్పిన స‌మంత చివ‌రికి దిల్‌రాజు ఒత్తిడి కార‌ణంగా మ‌న‌సు మార్చుకుని న‌టించింది.

ఊహించిన ఫ‌లిత‌మే  ప్రేక్ష‌కుల నుంచి రావ‌డంతో స‌మంత హ‌ర్ట్ అయింద‌ట‌. ఆ కార‌ణంగానే నిరుత్సాహానికి లోనైన ఆమె అజ‌య్ భూప‌తి చిత్రాన్ని నిరాక‌రించింద‌ని తెల‌సింది. `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ అజ‌య్ భూప‌తి `మ‌హా స‌ముద్రం` పేరుతో ఓ సినిమా చేయాల‌ని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు. చివ‌రికి అత‌ని స్క్రిప్ట్ న‌చ్చి శ‌ర్వానంద్ ఓకే చెప్పాడు. ఇందులో హీరోయిన్‌గా స‌మంత‌ను అనుకున్నారు. ఆమె కూడా జైకొట్టింది. `జాను` ప‌రాజ‌యంతో త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుని ఈ సినిమా నుంచి తప్ప‌కుంద‌ట‌.

ఆమె స్థానంలో అదితీరావు హైద‌రీని హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారని తెలిసింది. మ‌రో హీరో, మ‌రో హీరోయిన్ ఎంపిక జ‌ర‌గాల్సి వుంది. ఆ ఇద్ద‌రు ఫైన‌ల్ అయితే షూటింగ్ మొద‌ల‌వుతుంది. లేదంటే మ‌ళ్లీ హీరోల కోసం వేట మొద‌లుపెట్టాల్సి వుంటుంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు ఇద్ద‌రు హీరోలు మారారు. మూడ‌వ హీరో శ‌ర్వానంద్ అయినా చివ‌రి దాకా వుంటాడో లేక అత‌ను కూడా త‌ప్పుకుంటాడో చూడాలి.