`ఆర్ ఆర్ ఆర్‌` కోసం మ‌రో హీరో!


 Ajay Devgn entered RRR sets
Ajay Devgn entered RRR sets

`బాహుబ‌లి` వంటి సంచ‌ల‌న చిత్రం త‌రువాత ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి తెకెక్కిస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. డీవీవీ దాన‌య్య యూనివ‌ర్శ‌ల్ మీడియా బ్యాన‌ర్‌పై దాదాపు 400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజాంపై తిరుగుబాటు బావుటాని ఎగుర‌వేసిన విప్ల‌వ‌కారుడు కొమ‌రంభీం పాత్రలో ఎన్టీఆర్‌, బ్రిటీష్ వారిపై స‌మ‌ర‌శంఖం పూరించిన అల్లూరి సీతారామ‌రాజుగా మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు.

వీరిద్ద‌రితో పాటు ఈ చిత్రంలో మ‌రో హీరో న‌టిస్తున్నారు. ఆయ‌నే బాలీవుడ్ హీరో అజ‌య్‌దేవ‌గ‌న్‌. పూనేకు సంబంధించిన కీల‌క ఎపిసోడ్‌లో అజ‌య్‌దేవ‌గ‌న్ న‌టిస్తార‌ట‌. ఈ రోజు (మంగ‌ళ‌వారం) నుంచి ఆయ‌న‌కు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. `అజ‌య్‌దేవ‌గ‌న్‌తో తాజా షెడ్యూల్‌ని స్టార్ట్ చేస్తున్నందుకు `ఆర్ ఆర్ ఆర్‌` ఎంతో థ్రిల్ ఫీల‌వుతోంది. వెల్క‌మ్ సార్‌. అని ట్వీట్ చేశారు.

ఇప్ప‌టికే దాదాపు 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. రామ్‌చ‌ర‌ణ్ పాల్గొన‌గా వికారాబాద్ అడ‌వుల్లో యాక్ష‌న్ స‌న్నివేశాల్ని చిత్రీక‌రించారు. అంత‌కు ముందు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌పై ప‌లు కీల‌క ఘ‌ట్టాల్ని చిత్రీక‌రించారు. తాజాగా మ‌రో షెడ్యూల్ స్టార్ట‌యింది. ఈ షెడ్యూల్‌లో అజ‌య్‌దేవ్‌గ‌న్‌కు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల్ని చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. అలియాభ‌ట్‌, ఒలివియా మోరీస్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో స‌ముద్ర‌ఖ‌ని, రే స్టీవెన్‌స‌న్‌, లిస‌న్ డూడీ, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ ఏడాది జూలై 30న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు తెలిసింది.