`వాలిమై` షూటింగ్‌లో అజిత్‌కు ప్ర‌మాదం?


Ajith met accident in valimai shoot
Ajith met accident in valimai shoot

త‌మిళ స్టార్ హీరో అజిత్ న‌టిస్తున్న చిత్రం `వాలిమై`. కార్తి హీరోగా `ఖాకీ` వంటి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ని అందించి ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న హెచ్‌. వినోద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బోనీ క‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ న‌టి హుమా ఖురేషీ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తోంది. తెలుగు హీరో కార్తికేయ గుమ్మ‌కొండ విల‌న్‌గా త‌మిళ తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు.

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ గ‌త కొన్ని రోజులుగా హైద‌రాబా‌ద్‌లో జ‌రుగుతోంది. ఈ మూవీ షూటింగ్‌లో హీరో అజిత్ ప్ర‌మాదానికి గురైన‌ట్టు తెలుస్తోంది. కీల‌క యాక్ష‌న్ ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగింద‌ని, ఈ ప్ర‌మాదంలో అజిత్‌కు గాయాల‌య్యాయ‌ని చెబుతున్నారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ఆయ‌న‌ని ఆసుప‌త్రికి త‌ర‌లించార‌ట‌. చికిత్స అనంత‌రం గాయాల‌తోనే  షెడ్యూల్ కంప్లీట్ చేసిన అజిత్ తిరిగి చెన్నై వెళ్లిపోయిన‌ట్టు చిత్ర వ‌ర్గాల సమాచారం.

గాయాలు బ‌లంగా త‌గ‌ల‌డంతో ఆయ‌న‌కు నెల‌రోజుల విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని డాక్ల‌ర్లు సూచించార‌ట‌. దీంతో `వాలిమై` షూటింగ్ మ‌రో నెల రోజుల పాటు వాయిదా ప‌డిన‌ట్టు త‌మిళ చిత్ర వ‌ర్గాల స‌మాచారం.
అభిమాన హీరో అజిత్ ప్ర‌మాదం గురించి తెలియ‌డంతో అభిమానులు ఆందోళ‌న‌కు గుర‌య్యార‌ట‌. అయితే భ‌య‌ప‌డాల్సిన ప‌నేమీ లేద‌ని తెలియ‌డంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్న‌ట్టు చెబుతున్నారు.