అక్షయ్ కు మరో గోల్డెన్ ఇయర్ వచ్చినట్టేగా?


Akshay Kumar had fantastic 2019
Akshay Kumar had fantastic 2019

మన హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడానికే అష్టకష్టాలు పడుతుంటారు. మిడ్ రేంజ్ హీరోలు సైతం ఏడాదికి రెండే సినిమాలు చేయగలుగుతారు. కానీ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మాత్రం నిలకడగా ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తున్నాడు. సినిమాలు చేయడంతోనే అవ్వలేదు. నిలకడగా నాలుగు సినిమాల్లో కనీసం మూడు సినిమాలు హిట్ అవుతున్నాయి. డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాలతో కూడా మినిమం స్థాయి వసూళ్లు రాబట్టే రేంజ్ కు అక్షయ్ చేరుకున్నాడు. ఈ సంవత్సరం కూడా ఈ హీరోకి బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది మొదట్లో కేసరి సినిమాతో మన ముందుకు వచ్చాడు. జాతీయ భావం గల ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో అక్షయ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

అలాగే ఆ తర్వాత మిషన్ మంగళ్ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇస్రో చేపట్టిన మార్స్ మిషన్ ఆధారంగా రూపొందిన ఈ సినిమా అక్షయ్ సినిమాల్లో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక ద్వితీయార్ధంలో హౌస్ ఫుల్ 4 అనే రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేసాడు. హీరో అన్నాక ఎప్పుడూ మెసేజ్ లే ఇస్తాను అంటే కుదరదుగా. ఒక్కోసారి ఫ్యాన్స్ కు నచ్చే స్టఫ్ కూడా చేయాలి. అయితే హౌస్ ఫుల్ 4 కు దారుణమైన రేటింగ్స్ వచ్చాయి. ఈ సినిమా డిజాస్టర్ గా తేల్చేసారు క్రిటిక్స్. అయితే వసూళ్ల పరంగా మాత్రం ఈ సినిమా నిరాశపర్చలేదు.

కంటెంట్ పరంగా వీక్ కావడంతో మరో మంచి సినిమాతో రెండు నెలల్లో అక్షయ్ కుమార్ వచ్చేసాడు. గుడ్ న్యూస్ పేరుతో చాలా ట్రెండీ సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. వసూళ్లు కూడా అదిరిపోతున్నాయి. శుక్రవారం రూ.18 కోట్ల దాకా వ‌సూలు చేసిన ఈ సినిమా శనివారం 23 కోట్ల రూపాయల వరకూ తెచ్చిపెట్టింది. ఇక ఆదివారం వసూళ్లు కూడా శనివారానికి ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో ఉన్నాయి. వసూళ్ల ప్రకారం, కంటెంట్ ప్రకారం ఈ సినిమా సూపర్ హిట్ కేటగిరీలోకి వేసేయొచ్చు.

అటు సినిమాల సంఖ్య, ఇటు హిట్ల శాతం.. ఏ రకంగా చూసుకున్నా అక్షయ్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.