స్టైలిష్ స్టార్ ఎక్కడా తగ్గనంటున్నాడు!


Ala Vaikunthapuramulo dominating box office this weekend too
Ala Vaikunthapuramulo dominating box office this weekend too

సంక్రాంతికి సినిమాలను విడుదల చేస్తే ఉండే అడ్వాంటేజ్ ఏంటో టాలీవుడ్ మరోసారి చూసింది. ఈసారి సంక్రాంతికి నాలుగు సినిమాలు వచ్చాయి. వాటిలో జనాల దృష్టిని బాగా ఆకర్షించిన చిత్రాలు అంటే మాత్రం అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు అని చెప్పక తప్పదు. ఈ రెండు చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ ను దత్తత తీసుకుని వసూళ్ల మోత మోగించాయి. రెండు వారాల పాటు అసలు ఎదురనేది లేకుండా చేసాయి. ఈ రెండు చిత్రాలు కూడా బ్రేక్ ఈవెన్ ను దాటుకుని భారీ లాభాలను నమోదు చేసాయి. ముఖ్యంగా అల వైకుంఠపురములో మాత్రం కలెక్షన్స్ తో పిచ్చెకించింది. సంక్రాంతికి విజేతగా నిలుస్తూ అల వైకుంఠపురములో మిగతా చిత్రాలను డామినేట్ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మిగిలిన వర్గాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న ఈ చిత్రం అందరికీ ఫస్ట్ ఛాయస్ గా నిలిచింది.

ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సినిమా విడుదలై రెండు వారాలు గడుస్తున్నా ఇంకా ఎక్కడా స్లో అయ్యే సూచనలు కనిపించట్లేదు. సంక్రాంతికి సినిమాలు బాగుంటే రెండు వారాల దాకా ఎదురుండదు. అది మాములు విషయమే. అయితే అల వైకుంఠపురములో దీనికి భిన్నంగా నడుస్తోంది. రెండు వారాలు పూర్తయినా ఇంకా బాక్స్ ఆఫీస్ విన్నర్ గానే నిలిచింది. ఈ వీకెండ్ రవితేజ నటించిన డిస్కో రాజా విడుదలైంది. సినిమాకు టాక్ సంగతి ఎలా ఉన్నా కొత్త సినిమా కాబట్టి ఈ సినిమానే డామినేట్ చేస్తుంది అనుకుంటారు కానీ అల వైకుంఠపురములో కొత్త సినిమా కంటే ఎక్కువ రెవిన్యూ రాబడుతుండడం విశేషం.

తొలిరోజు రిలీజ్ హంగామా ఉంటుంది కాబట్టి పక్కన పెట్టేసినా నిన్న శనివారం స్క్రీన్స్ కౌంట్, రెవిన్యూ ఇలా ఏది తీసుకున్నా అల వైకుంఠపురములో హంగామా మాములుగా లేదు. ఇక ఈరోజు ఆదివారం కావడంతో అల వైకుంఠపురములో ఎక్కడా తగ్గేలా కనిపించట్లేదు. ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ విన్నర్ గా ఈ సినిమానే నిలిచేలా ఉంది.