మరో అరుదైన క్లబ్ లోకి అడుగుపెట్టిన బన్నీమరో అరుదైన క్లబ్ లోకి అడుగుపెట్టిన బన్నీ
మరో అరుదైన క్లబ్ లోకి అడుగుపెట్టిన బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన రికార్డులను అల వైకుంఠపురములో చిత్రంతో సాధిస్తున్నాడు. చాలా ఏరియాల్లో ఇప్పుడు అల వైకుంఠపురములో డామినేషన్ క్లియర్ గా ఉంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని పూర్తిగా సైడ్ చేసి అల వైకుంఠపురములో పెర్ఫార్మ్ చేస్తోంది. శుక్రవారం ఈ చిత్రం సాధించిన వసూళ్లు చూస్తే పెర్ఫార్మన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతోంది. ముఖ్యంగా మహేష్ అడ్డాగా పేరొందిన ఓవర్సీస్ లో బన్నీ దూకుడు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ చిత్రం శుక్రవారం ఏకంగా $200K పైన వసూలు చేయడం ట్రేడ్ పండితులను సైతం విస్మయానికి గురి చేసింది. దాంతో అల వైకుంఠపురములో ఇప్పుడు 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి సగర్వంగా అడుగుపెట్టింది.

ఇది అల్లు అర్జున్ కు తొలి 2 మిలియన్ డాలర్ బొమ్మ. అసలు ఇప్పటివరకూ బన్నీకి 1.5 మిలియన్ డాలర్ సాధించిన చిత్రమే లేదు. రేసు గుర్రం 1.35 మిలియన్ డాలర్స్ వద్ద ఆగిపోయింది. అదే బన్నీ కెరీర్ లో హయ్యస్ట్. ఇప్పుడు అల వైకుంఠపురములో రికార్డులను తిరగరాస్తోంది. శుక్రవారం వచ్చిన వసూళ్లు ప్రామిసింగ్ గా ఉండడంతో శనివారం, ఆదివారం అల వైకుంఠపురములో యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద తాండవమే చేస్తుందని అంతా అనుకుంటున్నారు. ఆదివారానికి ఈ చిత్రం 2.5 మిలియన్ డాలర్స్ సాధిస్తే ఆశ్చర్యమేం లేదు. మొత్తంగా ఫుల్ రన్ ముగిసేలోపు అల వైకుంఠపురములో 3 మిలియన్ మార్క్ కు దగ్గరగా చేరడం ఖాయం. ఇది నిజంగా అపూర్వ విజయమని చెప్పాలి. ఇప్పటికే యూఎస్ డిస్ట్రిబ్యూటర్ లాభాల్లో ఉన్నాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ చిత్రం ద్వారా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అల వైకుంఠపురములో 2 మిలియన్ డాలర్స్ కు చేరుకున్న నాలుగో త్రివిక్రమ్ సినిమా. ఇంతకుముందు అ..ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత చిత్రాలతో గురూజీ ఈ ఫీట్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ చిత్రం ద్వారా నాలుగోసారి ఈ క్లబ్ లోకి అడుగుపెట్టాడు.