ఓ మై గాడ్ డాడీ సాంగ్ రివ్యూ: ఈసారి కొంచెం తగ్గినట్లుందే!


Ala Vaikunthapuramulo third single OMG Daddy review
Ala Vaikunthapuramulo third single OMG Daddy review

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం అల వైకుంఠపురములో కి ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయో మనందరం చూస్తూనే ఉన్నాం. ఆ టీమ్ ఏది చేస్తుంటే అది సూపర్ హిట్ అయి కూర్చుంటోంది. ఇప్పటికే రెండు పాటలు విడుదల చేయగా, రెండూ కూడా సూపర్ డూపర్ హిట్ అన్న రేంజ్ లో ఉన్నాయి. సామజవరగమన ఇప్పటికే 91 మిలియన్ వ్యూస్ సాధించి 100 వమిలియన్ వ్యూస్ వైపు వెళుతుంటే రెండో పాట రాములో రాముల ఇప్పటికే 62 మిలియన్ వ్యూస్ సాధించి మొదటి సాంగ్ ను అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో మూడో పాట ఓ మై గాడ్ డాడీ ఈరోజు విడుదలైంది. ఇప్పటికే ఈ సాంగ్ ప్రోమో నాలుగు రోజుల క్రితం విడుదలై అందరినీ ఆకట్టుకున్న విషయం తెల్సిందే. అయితే ఈసారికి ఫుల్ సాంగ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

అల వైకుంఠపురములో మొదటి రెండు పాటలు సూపర్ హిట్ అవ్వడానికి ప్రధానం కారణమేంటి అని అడిగితే.. అవి సూపర్ క్యాచీగా ఉండడమని ఎవరైనా చెబుతారు. లిరిక్స్ సూపర్ గా ఉన్నాయి. మ్యూజికల్ వీడియోస్ హెల్ప్ అయ్యాయి, ఇవన్నీ పక్కనపెడితే మొదట థమన్ ఈ రెండు పాటలకు క్యాచీగా ఉండే ట్యూన్స్ ఇచ్చాడు. క్యాచీగా ఉండే ట్యూన్స్ కు ప్రధానంగా ఉండే పికప్ లైన్స్ కనెక్ట్ అయ్యేలా జాగ్రత్త పడ్డాడు. ఈ రెండు విషయాలలో మూడో పాట వెనకబడిందేమో అనిపిస్తుంది. ఓ మై గాడ్ డాడీ అనేది అల్లు అర్జున్ పాత్ర తన తండ్రి మురళీ శర్మ పాత్రను ఉద్దేశిస్తూ పడుతున్నదని ఎవరైనా ఇట్టే గెస్ చేస్తారు. అయితే ఈ పాటలో ర్యాప్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల పాటలో ఒక ఫ్లో లో సాగుతున్న భావన కలుగదు. పైగా ఇంగ్లీష్ ర్యాప్, తెలుగు ర్యాప్, ఫిమేల్ ర్యాప్ అని ఇలా రెండు, మూడు పెట్టేసరికి పాట పాడుకోవడానికి కష్టంగా మారుతోంది.

అలా అని ఓ మై గాడ్ డాడీ బాలేదని కాదు. మొదటి రెండు పాటలు నెలకొల్పిన అంచనాల్ని మాత్రం ఇది అందుకోలేదు అన్నది వాస్తవం. ఇక ఈ పాటకు లిరిక్స్ కృష్ణ చైతన్య అందించగా మెయిన్ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. తెలుగు ర్యాప్ ను రోల్ రైడా ఆలపించగా, ఇంగ్లీష్ ర్యాప్ ను రాహుల్ నంబియార్, ఫిమేల్ ర్యాప్ ను లేడీ కాష్ పాడారు. ఇక అదనపు గాత్రం బ్లేజి అందించాడు. మొదటి రెండు పాటలు మ్యూజిక్ వీడియోస్ తరహాలో చిత్రీకరించగా, మూడో పాటకు ఎందుకో లిరికల్ వీడియోతోనే సరిపెట్టేసారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే నటిస్తోన్న ఈ సినిమాలో సుశాంత్, నివేద పేతురాజ్, నవదీప్, టబు, మురళీ శర్మ, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జనవరి 12న అల వైకుంఠపురములో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.