బన్నీ ఫ్యాన్స్ కు శుభవార్త – మూడో పాటకు సర్వం సిద్ధం


Ala Vaikunthapurramloo third single teaser tomorrow
Ala Vaikunthapurramloo third single teaser tomorrow

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో చిత్ర ప్రమోషన్స్ దూకుడు మాములుగా ఉండట్లేదు. ఏ చిత్రానికి కనీవినీ ఎరుగని రీతిలో అల వైకుంఠపురములో కి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నారు. అయితే ఇంకా దానికి చాలా సమయం ఉన్నా కానీ రెండు నెలల ముందు నుండే ప్రమోషన్స్ ను మొదలుపెట్టి సినిమా ఎప్పుడూ వార్తల్లో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ముందు సామజవరగమన అంటూ మొదటి సింగిల్ విడుదల చేయగా అది మొదటిసారికే వైరల్ గా మారింది. క్రమక్రమంగా ఈ పాట సూపర్ హిట్ స్టేటస్ దాటి అంతకు మించి అనేలా ఉంది. ఇప్పటికే ఈ పాట యూట్యూబ్ లో 75 మిలియన్ వ్యూస్ ను దాటి దూసుకుపోతోంది. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే డిసెంబర్ లోపే 100 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించడం ఖాయం.

ఇక దీపావళి కానుకగా రెండో పాట రాములో రాములను విడుదల చేసారు. ఈ పాట మొదటి పాటకు తగ్గ రేంజ్ లో ఉండడంతో తొలిరోజు నుండే సూపర్ సాంగ్ అన్న టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన తొలి 24 గంటల్లో అత్యంత ఎక్కువగా విన్న సౌత్ ఇండియన్ పాటగా రాములో రాముల నిలిచింది. ఇలా ఈ రెండు పాటలు ఒకదాన్ని మించి మరొకటి హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ ఆనందానికి అవధుల్లేవు. రెండో సాంగ్ విడుదల తర్వాత సామజవరగమన షూట్ కోసం ఫ్రాన్స్ వెళ్లిన అల వైకుంఠపురములో టీమ్ ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమా షూట్ చేయని లొకేషన్స్ లో షూట్ చేసుకుని వచ్చింది.

టీమ్ తిరిగి రావడంతో రిలాక్స్ అవ్వకుండా మూడో పాటకు సంబంధించిన అప్డేట్ ను కూడా ఇచ్చాడు. ఓ మై గాడ్ డాడీ అంటూ సాగే మూడో పాటకు సంబంధించిన టీజర్ ను రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అంతేకాకుండా ఈ పాటలో ఇద్దరు సర్ప్రైజ్ ఎంట్రీ ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు.

రేపు నవంబర్ 14 బాలల దినోత్సవం కావున అల్లు అర్జున్ ఇద్దరు పిల్లలు ఈ సాంగ్ షూట్ లో కనిపిస్తారేమోనన్న ఊహాగానాలు మొదలయ్యాయి. మొదటి రెండు పాటలు సూపర్ హిట్ కావడంతో మూడో పాట ఎలా ఉంటుందోనన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి. మూడో పాట విడుదలను రేపు టీజర్ తో పాటే తెలుపనున్నారు. మొదటి రెండు పాటలకు ఇలాగే మొదట టీజర్ వదిలి తర్వాత పూర్తి పాటను వదలడంతో దీనికి కూడా అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నారు.

పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోన్న అల వైకుంఠపురములో లో సుశాంత్, నివేద పేతురాజ్, నవదీప్, టబు, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, ఎస్ రాధా కృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ కూడా ఈ నెలలోనే వస్తుందన్న పుకార్లు ఉన్నాయి.