వైకుంఠపురములో సీక్వెల్.. సరైన నిర్ణయమేనా?


వైకుంఠపురములో సీక్వెల్.. సరైన నిర్ణయమేనా?
వైకుంఠపురములో సీక్వెల్.. సరైన నిర్ణయమేనా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో, ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం అతి పెద్ద సక్సెస్ ను సాధించింది. సూపర్ హిట్ అవుతుంది అనుకున్న ఈ సినిమా సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ ను ఫుల్లుగా వాడుకుంటూ నాన్ బాహుబలి రికార్డులను సైతం తిరగరాసింది. పెరిగిన టికెట్ రేట్లు, అదనపు షోలు, అన్ని సినిమాలకంటే బెటర్ రేటింగ్ రావడం.. ఇలా అన్నీ కలిసి అల వైకుంఠపురములో చిత్రం పెద్ద సక్సెస్ ను సాధించింది. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ఊహించని అల వైకుంఠపురములో టీమ్ వరసపెట్టి పార్టీలు చేసుకుంది. సినిమా రిలీజ్ తర్వాత దాదాపు అరడజనుకు పైగా సక్సెస్ మీట్, పార్టీ అంటూ హంగామా చేస్తూనే ఉంది. సినిమా విడుదలై 30 రోజులు పూర్తవుతోంది, ఇప్పుడు ప్రమోషన్స్ పూర్తిగా నెమ్మదించాయి. అయినా కలెక్షన్స్ మాత్రం బాగున్నాయి. ఇప్పటికీ వీకెండ్స్ లో ఈ సినిమా హౌస్ ఫుల్స్ అవుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. బయ్యర్లు అందరూ ఇప్పటికే భారీ లాభాలను వెనకేసుకున్నారు. ఓవర్ ఫ్లోస్ తో నిర్మాతల పంట కూడా పండింది.

ఇవన్నీ పక్కన పెడితే అల వైకుంఠపురములో చిత్రానికి సీక్వెల్ ఉంటుందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెల్సిందే. దీనికి బన్నీ ఫ్యాన్స్ ఒకింత ఎగ్జైట్ అయ్యారు కూడా. అయితే దీనికి ప్రతికూలంగా పనిచేసేలా రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది టాలీవుడ్ లో సీక్వెల్స్ సరిగ్గా ఆడిన చరిత్ర లేదు. బాహుబలి 2 తప్ప పెద్దగా సీక్వెల్స్ ఏవీ వర్కౌట్ అవ్వలేదు. పోనీ సెంటిమెంట్ పట్టించుకోకూడదు అనుకున్నా, అల వైకుంఠపురములో చిత్రం సీక్వెల్ కు పనికొచ్చే కథేం కాదు. అది పూర్తిగా కంప్లీట్ అయిన కథే. అయితే టైటిల్ అదే పెట్టి వేరే సెటప్ లో సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో తెలీదు కానీ పై రెండు కారణాలు ఈ చిత్రానికి సీక్వెల్ వద్దనే చెబుతున్నాయి. మరి త్రివిక్రమ్ ఎలా ఆలోచిస్తున్నాడో!