బాల‌య్య సినిమాలో అల్ల‌రోడు కన్ఫామా ?బాల‌య్య సినిమాలో అల్ల‌రోడు కన్ఫామా ?
బాల‌య్య సినిమాలో అల్ల‌రోడు కన్ఫామా ?

నంద‌మూరి బాల‌కృష్ణ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ క‌ల‌యిక‌లో ఓ భారీ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాల‌కృష్ణ  ఈ చిత్రంలో ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. ఓ పాత్ర‌లో వైట్ అండ్ వైట్‌లో అద‌ర‌గొడుతున్నారు.

మ‌రో పాత్ర‌లో అఘోరాగా క‌నిపించ‌బోతున్నారు. ఇటీవ‌ల బాల‌య్య పుట్టిన రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేసిన   ఫ‌స్ట్ రోర్ సినిమాపై భారీ అంచ‌నాల్ని పెంచేసింది. బాల‌య్య‌ క్యారెక్ట‌ర్ ఏ స్థాయిలో ప‌వ‌ర్‌ఫల్‌గా వుండ‌బోతోంద‌నేది ఈ ఫ‌స్ట్ రోర్‌తో తేలిపోయింది. ఇదిలా వుంటే ఈ మూవీ లోని ఓ కీల‌క పాత్ర కోసం యంగ్ హీరో కావాల‌ని బోయ‌పాటి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా ఈ పాత్ర కోసం హీరో అల్ల‌రి న‌రేష్‌ని చిత్ర బృందం సంప్ర‌దించిన‌ట్టు తెలిసింది.

ఈ పాత్ర కోసం ముందు న‌వీన్ చంద్ర‌ని, ఆత‌రువాత నారా రోహిత్‌ని అనుకున్నార‌ని వార్త‌లు వినిపించాయి. అయితే తాజాగా ఆ పాత్ర కోసం అల్ల‌రి న‌రేష్‌ని క‌న్ఫ‌మ్ చేసే ప‌నిలో చిత్ర‌బృందం వున్న‌ట్టు తెలిసింది. అల్ల‌రి న‌రేష్ స‌పోర్టింగ్ పాత్ర‌ల్లో న‌టించిన గ‌మ్యం, మ‌హ‌ర్షి చిత్రాలు మంచి విజ‌యాల్ని సొంతం చేసుకున్నాయి. ఈ కార‌ణంగానే బోయ‌పాటి అల్ల‌రి న‌రేష్‌ని ఎంచుకోవాల‌నుకుంటున్నార‌ట‌. ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాలంటే మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించాల్సిందే.