గేర్ మారుస్తున్న అల్ల‌రి న‌రేష్‌!


గేర్ మారుస్తున్న అల్ల‌రి న‌రేష్‌!
గేర్ మారుస్తున్న అల్ల‌రి న‌రేష్‌!

`అల్ల‌రి` సినిమాతో కెరీర్ ప్రారంభించి ఆ పేరునే త‌న ఇంటి పేరుర‌గా మార్చుకుని అల్ల‌రి న‌రేష్ అయ్యారు. కామెడీనే ప్ర‌ధానంగా న‌మ్ముకుని వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ వ‌స్తున్న అల్ల‌రి న‌రేష్ గ‌త కొంత కాలంగా కెరీర్ ప‌రంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. గ‌త మూడేళ్లుగా ప్రేక్ష‌కుల అభిరుచుల్లో మార్పులొచ్చాయి. ఆ మార్పుల‌కు త‌గ్గ‌ట్టుగా సినిమాలో కంటెంట్ కొత్త‌గా వుంటేనే సినిమాని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు.

ఈ విష‌యాన్ని ఆల‌స్యంగా గ్ర‌హించిన అల్ల‌రి న‌రేష్ కొంత విరామం తీసుకుని చేస్తున్న చిత్రం `నాంది`. న‌రేష్ న‌టిస్తున్న 57వ చిత్రిమ‌ది. రెగ్యుల‌ర్ పంథాకు పూర్తి భిన్నంగా రూపొందుతున్న ఈ చిత్రం ఈ సోమ‌వారం లాంచ‌నంగా ప్రారంభ‌మైంది. ఎస్వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు వేగేశ్నస‌తీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా విజ‌య్‌ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్, ఉత్త‌మ‌న్ ప్ర‌వీణ్‌, ప్రియ‌ద‌ర్శి, దేవి ప్ర‌సాద్‌. విన‌య్‌వ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన పోస్ట‌ర్లు సినిమా కొత్త‌గా వుంటుంద‌ని తెలియ‌జేస్తున్నాయి. తొలి లుక్‌లో అల్ల‌రి న‌రేష్‌ క‌ళ్ల‌ల్లోంచి ర‌క్తం ఓడుతున్న లుక్, తాజాగా రిలీజ్ చేసిన మ‌రో లుక్ ఒళ్లుగ‌గుర్పొడిచే విధంగా వున్నాయి. రెండ‌వ పోస్ట‌ర్‌లో న‌రేష్ ఒంటిపై నూలుపోగు లేకుండా చైన్స్‌తో త‌ల‌కిందులుగా వేలాడ‌దీసిన తీరు సినిమా ఏ రేంజ్‌లో వుండ‌బోతోందో తెలియ‌జేస్తోంది. ఈ స్టిల్స్ చూస్తుంటే అల్ల‌రి న‌రేష్ గేర్ మార్చిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ స్టిల్స్కి త‌గ్గ‌ట్టే సినిమా న‌రేష్ కెర‌ర్‌ని స‌రికొత్త మలుపు తిప్పుతుందో చూడాలి.