ఉత్కంఠ‌భ‌రితంగా అల్ల‌రి న‌రేష్ `నాంది`‌!



ఉత్కంఠ‌భ‌రితంగా అల్ల‌రి న‌రేష్ `నాంది`‌!
ఉత్కంఠ‌భ‌రితంగా అల్ల‌రి న‌రేష్ `నాంది`‌!

కొంత విరామం త‌రువాత అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్న చిత్రం `నాంది`. హ‌రీష్ శంక‌ర్ వ‌ద్ద కో- డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేసిన విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మంగ‌ళ‌వారం హీరో అల్ల‌రి న‌రేష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర టీజ‌ర్‌ని టాలీవుడ్ సెన్సేష‌న్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ రిలీజ్ చేశారు.

`ఈ ప్ర‌పంచాన్ని టీజ‌ర్ రూపంలో పంచుకోవ‌డం చాలా సంతోషంగా వుంది. `నాంది` చిత్ర బృందానికి నా త‌రుపున హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. న‌రేష్ అన్న ఇందులో మీరు అద్భుతంగా వున్నారు`అని విజ‌య్ దేవ‌ర‌కొండ ట్వీట్ చేశారు. ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ వాయిస్ ఓవ‌ర్‌తో టీజ‌ర్ మొద‌లైంది. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. న‌రేష్ త‌న‌లోని న‌టుడిని `నేను` త‌రువాత మ‌ళ్లీ పూర్తి స్థాయిలో బ‌య‌టికి తీసిన‌ట్టుగా క‌నిపిస్తోంది.

`ఒక మ‌నిషి పుట్ట‌డానికి కూడా తొమ్మిది నెల‌లే టైమ్ ప‌డుతుంది. మ‌రి నాకు న్యాయం చేయ‌డానికేంటి స‌ర్‌.. ఇన్ని సంవ‌త్స‌రాలు ప‌డుతోంది` అంటూ న‌రేష్ చెబుతున్న డైలాగ్స్ సినిమా ఏ రేంజ్‌లో వుండ‌బోతోందో తెలియ‌జేస్తున్నాయి. పోలీస్ స్టేష‌న్‌లో న‌రేష్ న‌గ్నంగా క‌నిపిస్తున్న స‌న్నివేశాలు, ట్రయ‌ల్ ఖైదీగా న‌రేష్‌ని పోలీసులు చిత్ర హింస‌ల‌కు గురిచేస్తున్న తీరు ఉత్కంఠ‌త రేకెత్తిస్తోంది. కొంత విరామం త‌రువాత న‌రేష్ త‌న పంథాకు భిన్నంగా చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు 80 శాతం చిత్రీక‌‌ర‌ణ పూర్త‌యింది. లాక్‌డౌన్ కు ముందే చిత్రీక‌ర‌ణ దాదాపుగా పూర్త‌యింది. ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్‌గా వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ న‌టిస్తుండ‌గా, పోలీస్ ఆఫీస‌ర్‌గా హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, న‌వ‌మి, ప్ర‌వీణ్, ప్రియ‌దర్శి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. `నాంది ఎఫ్ ఐ ఆర్ (ఫ‌స్ట్ ఇంపాక్ట్‌) పేరుతో విడుద‌లైన టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగా వుంది.