మొదటి సినిమా విడుదల కాలేదు.. జాక్ పాట్ కొట్టేసాడు


Allu aravind offers movie chance to palasa 1978 director karunakumar
Allu aravind offers movie chance to palasa 1978 director karunakumar

మొదటి సినిమా విడుదలకు ముందు ఎవరికైనా ఏ రేంజ్ లో టెన్షన్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా తొలి సినిమా ఎవరికైనా చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. సక్సెస్ అయితే దాన్ని బేస్ చేసుకుని ఇండస్ట్రీలో అద్భుతమైన కెరీర్ ను నిర్మించుకోవచ్చు. ఒకవేళ చిన్న సినిమా కనుక అయితే దర్శకుడైనా, హీరో అయినా కోరుకునేది గుర్తింపు మాత్రమే. ఆ సినిమా మరిన్ని సినిమాలకు అవకాశాలు ఇస్తుందని వారి ఆశ. అయితే మొదటి సినిమా విడుదల కాకుండానే రెండో సినిమాకు ఆఫర్ వస్తే? అది కూడా గీతా ఆర్ట్స్ వంటి పెద్ద సంస్థలో అల్లు అరవింద్ వంటి మెగా నిర్మాత పనితనం నచ్చి పిలిచి అవకాశమిస్తే ఎలా ఉంటుంది? గాల్లో ఆనందంతో తేలిపోవడమే కదా. ప్రస్తుతం పలాస 1978 చిత్రాన్ని తెరకెక్కించి విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న దర్శకుడు కరుణకుమార్ కు ఇంచుమించు అలాంటి పరిస్థితే ఉంది.

ఎందుకంటే మెగా నిర్మాత అల్లు అరవింద్ ఇటీవలే పలాస 1978 చిత్రాన్ని చూసి తెగ నచ్చేయడంతో దర్శకుడ్ని పిలిచి తన బ్యానర్ లో ఒక సినిమా చేయాల్సిందిగా అవకాశం ఇచ్చాడు. తొలి సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఇది జరుగుతుందని చెప్పడం విశేషం. గీతా ఆర్ట్స్ ట్విట్టర్ పేజ్ లో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. లండన్ బాబులు అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రక్షిత్ హీరోగా సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో కరుణకుమార దర్శకత్వంలో రూపొందిన సినిమా పలాస 1978.

రియలిస్టిక్ టేకింగ్ తో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ద్వారా అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ సింగర్, మ్యుజిషియన్ అయిన రఘు కుంచె ఈ సినిమాలో విలన్ గా చేయడం మరో ప్రత్యేకత. ఈ చిత్రాన్ని నచ్చి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ విడుదల చేస్తోంది. మరి దాదాపు కొత్త వాళ్లతో తెరకెక్కిన ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.