అల్లు అరవింద్ మెగా టర్న్ తీసుకున్నాడా?


Allu Aravind to produce Vakkantham Vamsi Sai Dharam Tej project
Allu Aravind to produce Vakkantham Vamsi Sai Dharam Tej project

స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొన్ని దశాబ్దాల నుండి గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తూ విజయవంతమైన నిర్మాతగా ఎదిగాడు. ఆ నలుగురిలో ఒకరిగా అల్లు అరవింద్ ను పరిగణిస్తారు. అల్లు అరవింద్ నుండి సినిమా వస్తోందంటే మినిమం గ్యారంటీ అన్న నమ్మకం అటు ప్రేక్షకులలోనూ ఇటు బయ్యర్లలోనూ ఉంది. స్క్రిప్ట్ దశలోనే అల్లు అరవింద్ చాలా చర్చలు జరుపుతాడు. అంతా ఓకే అనుకున్నాకే షూటింగ్ కు తీసుకెళ్తాడు. బడ్జెట్ విషయంలో కూడా కచ్చితంగా ఉంటాడు. కథకు ఎంత అవసరమో అంతే పెడతాడు అరవింద్. ఇక ప్రమోషన్ల విషయంలో అల్లు అరవింద్ ఎప్పుడూ అందరికంటే ముందే ఉంటాడు. అసలు డిజిటల్ మీడియంలో సినిమాల ప్రమోషన్స్ యొక్క ప్రాముఖ్యతను అందరికంటే ముందే గుర్తించాడు. ఇన్ని ప్లస్ లు ఉన్నాయి కాబట్టే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఎక్కువ విజయవంతమైన చిత్రాలే వచ్చాయి. అలాగే ఇప్పుడు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ను కూడా స్థాపించాడు.

ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ప్రతిరోజూ పండగే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు అల్లు అరవింద్. ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. కచ్చితంగా హిట్ అవుతుందనే అంటున్నారు. మారుతి ఈ చిత్రానికి దర్శకుడు. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సాయి ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్ర ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ సాయి ధరమ్ తేజ్ తో పిల్లా నువ్వు లేని జీవితం తర్వాత ఎప్పటినుండో సినిమా నిర్మించాలని అనుకుంటున్నానని అది ప్రతిరోజూ పండగేతో ఇప్పటికి కుదిరిందని చెప్పాడు. అలాగే వచ్చే ఏడాది మరో చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ప్రకటించాడు.

ప్రతిరోజూ పండగే షూటింగ్ ను ముగించుకున్న సాయి ధరమ్ తేజ్, తన తర్వాతి చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ షూటింగ్ ను మొదలుపెట్టాడు. మే 1న ఈ చిత్రం విడుదల కానుందని షూటింగ్ మొదలైన రోజే ప్రకటించేసారు.ఇదిలా ఉంటే.. వక్కంతం వంశీ, అల్లు అరవింద్ నిర్మాణంలో వరుణ్ తేజ్ హీరోగా సినిమా తెరకెక్కనుందని ఒక రూమర్ మొదలైంది. వక్కంతం వంశీ తొలి సినిమా నా పేరు సూర్య ప్లాప్ అయినా కానీ అల్లు అరవింద్ నమ్మి వంశీకి మరో సినిమాకు అవకాశం ఇచ్చాడన్నది ఆ రూమర్ సారాంశం. అయితే తాజా సమాచారం ప్రకారం, అల్లు అరవింద్, వక్కంతం వంశీకి అవకాశం ఇచ్చిన మాట వాస్తవమే కానీ వరుణ్ తేజ్ తో కాదని, సాయి ధరమ్ తేజ్ తో ఆ సినిమా ఉంటుందని లేటెస్ట్ న్యూస్ మొదలైంది. అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్ తో వచ్చే ఏడాది తీస్తానన్న సినిమా ఇదేనని అంటున్నారు. హై బడ్జెట్ లో కాకుండా మీడియం బడ్జెట్ ఈ చిత్రానికి కేటాయించబడుతుందిట. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.