బన్నీ, మహేష్ ఎవరూ తగ్గట్లేదుగా


బన్నీ, మహేష్ ఎవరూ తగ్గట్లేదుగా
బన్నీ, మహేష్ ఎవరూ తగ్గట్లేదుగా

దసరా సీజన్ ముగియడంతో ఇప్పుడు ఫోకస్ మొత్తం సంక్రాంతి సీజన్ పై పడింది. సంక్రాంతికి ఇప్పటికే నాలుగు సినిమాలు షెడ్యూల్ అయి ఉన్న విషయం తెల్సిందే. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా, రజినీకాంత్ దర్బార్ చిత్రాలు సంక్రాంతికి విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించేసాయి. రీసెంట్ గా వెంకటేష్, నాగ చైతన్య నటించిన వెంకీ మామ కూడా సంక్రాంతికే వస్తుందని వార్తలు వచ్చినా కూడా దీనిపై అధికారిక సమాచారం లేదు.

అందరికంటే ముందు నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. రజినీకాంత్ దర్బార్ జనవరి 14న రానుంది. అయితే సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాల రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. ఎంత సంక్రాంతికి వస్తున్నా కానీ ఒకేరోజు విడుదలవకుండా చూడాలని, ఒకరు ముందు ఒకరు వెనకాల రావాలని చూసారు. అయితే ఈ రెండు సినిమాల నిర్మాతల మధ్య సయోధ్య కుదిరినట్లు లేదు. రెండు సినిమాలు కూడా ఒకే రోజు విడుదల కానున్నాయి.

మొదట అల వైకుంఠపురములో చిత్రం జనవరి 12న విడుదల అవుతుందని ఒక పోస్టర్ ద్వారా తెలియజేసారు చిత్ర యూనిట్. ఇది జరిగిన కొన్ని నిమిషాల్లోనే మహేష్ బాబు తన అధికారిక అకౌంట్ ద్వారా సరిలేరు నీకెవ్వరు కూడా జనవరి 12నే వస్తుందని తెలియజేశాడు. మరి ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కానున్న నేపథ్యంలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.