అల వైకుంఠపురములో కాంబో అతి త్వరలో!అల వైకుంఠపురములో కాంబో అతి త్వరలో!
అల వైకుంఠపురములో కాంబో అతి త్వరలో!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో జనవరిలో విడుదలై సంచలనం సృష్టించిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ చిత్రం విడుదలయ్యాక ఎన్ని రికార్డులను కొల్లగొట్టిందో మనం చూసాం. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ఉన్న రికార్డులు అన్నీ ఈ చిత్రంతో తుడిచిపెట్టుకుపోయాయి. బాహుబలి 2 తప్పించి ఇక్కడ, ఓవర్సీస్ లో అన్ని రికార్డులను ఈ చిత్రం కొల్లగొట్టింది. బయ్యర్లకు నిజమైన పండగను తెచ్చింది ఈ చిత్రం. దాదాపు రెండింతల లాభాలు ఈ చిత్రం ద్వారా వెనకేసుకున్నారు బయ్యర్లు. ఇంతటి ఘనవిజయం సాధించిన చిత్ర కాంబో త్వరలోనే మళ్ళీ రిపీట్ కాబోతోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ శైలి గురించి మనందరికీ తెలుసు. హీరోలను, హీరోయిన్లను రిపీట్ చేయడం త్రివిక్రమ్ కు ఉన్న అలవాటు. మహేష్ తో రెండు సార్లు, పవన్ తో మూడు సార్లు, బన్నీతో మూడు సార్లు పనిచేసిన త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో రెండోసారి పనిచేయబోతున్నాడు. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో రెండో మూవీ ఈ ఏడాదే పట్టాలెక్కనుంది. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్ర విడుదల ఉంటుంది. దాని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎవరితో పనిచేయబోతున్నాడు అంటే చాలానే పేర్లు వినిపించాయి కానీ తాజా సమాచారం ప్రకారం మాటల మాంత్రికుడు బన్నీతో మళ్ళీ కలిసి చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడట. ఇందుకోసం ఇప్పటికే ఒక లైన్ అనుకున్నారని తెలుస్తోంది.

త్రివిక్రమ్ తన ఫెవరెట్ దర్శకుడని, తనతో ఎన్ని సినిమాలైనా చేస్తానని అల్లు అర్జున్ పలుమార్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో వచ్చే ఏడాది పునరావృత్తమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. ఈ నెల రెండో అర్ధ భాగంలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ సమయానికి విడుదల కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ ఇద్దరూ దాదాపు ఒకే సమయానికి ఫ్రీ అవుతారు కాబట్టి వారి కాంబినేషన్ లో సినిమా ఉండడం నిజమేనేమో.