అప్పుడు మహేష్ తో, ఇప్పుడు బన్నీతో తారక్


అప్పుడు మహేష్ తో, ఇప్పుడు బన్నీతో తారక్
అప్పుడు మహేష్ తో, ఇప్పుడు బన్నీతో తారక్

ఈ తరం టాప్ హీరోలు ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోలు సందర్భాన్ని బట్టి క్లోజ్ గా ఉంటూ తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని ప్రకటిస్తూనే ఉన్నారు. భరత్ అనే నేను ఈవెంట్ కు ముఖ్య అతిధిగా తారక్ రావడం రెండేళ్ల క్రితం ఒక సెన్సేషన్. బయట ఫంక్షన్ లో అలా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి కనిపించడం చాలా అరుదు కాబట్టి అటు మహేష్ అభిమానులు, ఇటు నందమూరి అభిమానులు కూడా చాలా సంతోషించారు. భరత్ అనే నేనుకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా కలిసొచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

అయితే అప్పుడు మహేష్ సినిమాకు ముఖ్య అతిధిగా విచ్చేసిన తారక్, ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా ఈవెంట్ కు ముఖ్య అతిధిగా రాబోతున్నట్లు సమాచారం. అవును, అల వైకుంఠపురములో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తారక్ చీఫ్ గెస్ట్ గా విచ్చేయనున్నాడట. ఈ మేరకు అల వైకుంఠపురములో టీమ్ డిసైడ్ అవ్వడం, తారక్ ను సంప్రదించడం కూడా జరిగిపోయింది. ఎన్టీఆర్ కూడా సానుకూలంగానే స్పందించాడట. ఈ నేపథ్యంలో జనవరి మొదటి వారంలో ఈ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎన్టీఆర్ కు మంచి ర్యాపో ఉంది. అరవింద సమేతకు ఇద్దరూ కలిసి పనిచేసారు. అలాగే ఆర్ ఆర్ ఆర్ తర్వాత తారక్ త్రివిక్రమ్ దర్శకత్వంలోనే సినిమా చేయబోతున్నాడు.

అటు అల్లు అర్జున్ తో కూడా తారక్ కు మంచి రిలేషన్ ఉంది. ఇద్దరూ చాలా సందర్భాల్లో కలుసుకుని, ఒకరి యాక్టింగ్ ను మరొకరు, ఒకరి డ్యాన్స్ ను మరొకరు పొగుడుకున్నారు కూడా. ఇదిలా ఉంటే అప్పుడు మహేష్ సినిమాను సపోర్ట్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈసారి తమ సపోర్ట్ ను అల వైకుంఠపురములో చిత్రానికి ఇస్తున్నారు. అల వైకుంఠపురములో చిత్రానికి పోటీగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ఉన్న విషయం తెల్సిందే.