బన్నీ లుక్స్, వేరియేషన్స్ అదిరిపోతాయి అంటున్నారే


బన్నీ లుక్స్, వేరియేషన్స్ అదిరిపోతాయి అంటున్నారే
బన్నీ లుక్స్, వేరియేషన్స్ అదిరిపోతాయి అంటున్నారే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత సుకుమార్ తో సినిమాను ఓకే చేసుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలు కావాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ముందు బ్యాంకాక్ లో అనుకున్నారు, తర్వాత కేరళ అన్నారు, చివరికి ఆంధ్రప్రదేశ్ లోని అటవీ ప్రాంతంలో తీయాలనుకున్నారు కానీ కరోనా వైరస్ భయం వల్ల వారం రోజుల పాటు ఏ షూటింగ్స్ నిర్వహించకూడదన్న నిర్ణయంతో బన్నీ – సుకుమార్ సినిమా ముందుకెళ్ళకుండా ఆగిపోయింది. ఏప్రిల్ నుండి అన్నీ సవ్యంగా ఉంటే షూటింగ్ మొదలుకావొచ్చు.

అయితే ఈలోగా సుకుమార్ తన పని పూర్తి చేసుకుంటున్నాడు. అన్నీ పెర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అన్నది చూసుకుంటున్నాడు. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోస్ లో బన్నీపై లుక్ టెస్ట్ నిర్వహించాడు సుకుమార్. ఈ చిత్రంలో అల్లు అర్జున్ విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడు. లుక్స్ పరంగా చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. సినిమా సినిమాకూ బన్నీ తన లుక్స్ ను మార్చుకుంటున్న తీరు అభిమానులకు పండగనే చెప్పాలి.

నా పేరు సూర్య సినిమాలో రఫ్ అండ్ టఫ్ లుక్ లోకి మారిపోయిన అల్లు అర్జున్ తర్వాత అల వైకుంఠపురములో చిత్రానికి సాఫ్ట్ లుక్ లోకి వచ్చేసాడు. హెయిర్ స్టైల్ దగ్గరనుండీ ప్రతీదీ బన్నీ సినిమా సినిమాకూ మార్చుకుంటున్నాడు. అలాగే ఇప్పుడు సుకుమార్ సినిమాలో కూడా బన్నీ లుక్ విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే తన వద్ద పనిచేసే వ్యక్తి ఇంట్లో ఫంక్షన్ కు వెళ్లిన బన్నీని చూసి అందరూ ఎగ్జైట్ అయ్యారు. గుబురు గెడ్డంతో, బాగా పెంచిన జుట్టుతో బన్నీ భలే ఉన్నాడు. అలాగే సుకుమార్ కూడా లుక్ టెస్ట్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అదే లుక్ ను సినిమాకు ఫైనల్ చేశారట. రష్మిక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.