రౌడీ ని పొగిడిన స్టైలిష్ స్టార్రౌడీ ని పొగిడిన స్టైలిష్ స్టార్
రౌడీ ని పొగిడిన స్టైలిష్ స్టార్

టాలీవుడ్ కథానాయకులలో అల్లు అర్జున్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఆయన రెండో సినిమా ఆర్య తో మొదలు పెడితే ఇప్పుడు రిలీజ్ అవుతున్న అల వైకుంఠపురం.. సినిమా వరకు ప్రతి సినిమాలోనూ, స్క్రిప్ట్ విషయంలో దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చే బన్నీ తన యొక్క మేకప్, ఆహార్యం అభినయం మరియు డాన్సుల విషయంలో మాత్రం దర్శక నిర్మాతలతో చర్చించి, కొత్తదనంగా వాటిని ప్రదర్శించే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉంటాడు. ఒక రకంగా చిరంజీవి తర్వాత టాలీవుడ్ లో డాన్స్ కి క్రేజ్ తీసుకొచ్చిన హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ ఇద్దరూ చెప్పుకో దగ్గ హీరోలు. మేకప్,కాస్ట్యూమ్స్, డాన్స్, స్టైల్ ఈ విభాగాలలో అల్లుఅర్జున్ చూపించే విలక్షణత వల్ల అభిమానులు ఆయనని స్టైలిష్ స్టార్ అని పిలుచుకుంటారు.

కానీ తాజాగా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలలో తనకన్నా మరొక ఇద్దరు హీరోలకి మంచి అభిరుచి ఉందని వారి యొక్క స్టైల్ చాలా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. వారిలో ఒకరు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కాగా మరొకరు టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ. రణవీర్ సింగ్ యశ్ రాజ్ ఫిలింస్ వారి బ్యాండ్ బాజా బారత్ అనే సినిమాతో అనే సినిమాతో పరిచయం అయి సినిమా సినిమాకు ఎదుగుతూ ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ స్టార్ గా రాణిస్తున్నాడు. ఇక వరుస విజయాల బంగారు కొండ మన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శేఖర్ కమ్ముల లీడర్ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అర్జున్ రెడ్డి సినిమా తో యావత్ దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అతి తక్కువ కాలంలో ప్రస్తుత రెండు తెలుగు రాష్ట్రాలలో యువత అత్యధికంగా అభిమానించే హీరో స్థాయికి చేరుకున్నాడు విజయ్ దేవరకొండ. అల్లు అర్జున్ లాంటి ఒక పెద్ద హీరో మిగతా ఇద్దరు హీరోలు స్టైల్ కూడా చాలా బాగుంటుందని, నేను వాళ్ళ స్టైల్ పరిశీలిస్తూ ఉంటానని, మనసులో ఉన్న మాట మీడియాతో పంచుకోవటం నిజంగా ఇండస్ట్రీలో పెరుగుతున్న స్నేహపూర్వక వాతావరణానికి నిదర్శనం. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుందాం.