అల్లు అర్జున్ ప్లాన్ ను తలకిందులు చేసిన త్రివిక్రమ్


అల్లు అర్జున్ ప్లాన్ ను తలకిందులు చేసిన త్రివిక్రమ్
అల్లు అర్జున్ ప్లాన్ ను తలకిందులు చేసిన త్రివిక్రమ్

రంగస్థలం సినిమా తర్వాత దాదాపు ఏడాది పాటు సుకుమార్ ఖాళీగా గడిపేశాడు. అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మరో సినిమా సెట్ చేసుకోవడానికి సుకుమార్ తల ప్రాణం తోకకు వచ్చింది. మహేష్ బాబుతో సినిమా అన్నారు. వర్కౌట్ అవ్వలేదు. వెంటనే అల్లు అర్జున్ ను ఒప్పించగలిగాడు. కాకపోతే సినిమా మొదలవ్వడానికి లేట్ అవుతుంది. ఎందుకంటే అప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల వైకుంఠపురములో సినిమాను మొదలుపెట్టేశాడు బన్నీ. త్రివిక్రమ్ ను అడిగితె అక్టోబర్ కల్లా సినిమాను పూర్తి చేసి ఇచ్చేస్తాను అని మాట ఇచ్చాడు. దాంతో సుకుమార్ తో డిసెంబర్ మొదటి వారం నుండి షూటింగ్ కి వెళ్ళిపోదాం అని మాట ఇచ్చేసాడు బన్నీ. ఎందుకంటే సుకుమార్ తో చేయబోయే సినిమాకు కనీసం 15 రోజుల ప్రేపరషన్ టైమ్ కావాలి. ఎర్రచందనం నేపథ్యంలో సాగే కథ, అందులో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించాలి. ఈ నేపథ్యంలో తన లుక్ ను మొత్తం మార్చుకోవడానికి సిద్ధమయ్యాడు. ప్రతి సినిమాకు బన్నీ లుక్ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పేదేముంది. సుకుమార్ సినిమాను కూడా తనను తాను పూర్తిగా మార్చుకోవడానికి సిద్ధమయ్యాడు.

ఇంతవరకూ ప్లాన్ బానే ఉంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ ప్లాన్ ను పూర్తిగా మార్చేశాడు. డిసెంబర్ నుండి సుకుమార్ సినిమాను మొదలుపెట్టాలన్న కోరికను త్రివిక్రమ్ నీరు గార్చేసాడు. అక్టోబర్ కే సినిమాను పూర్తి చేస్తానని మాట ఇచ్చిన త్రివిక్రమ్ ఇప్పుడు మాట తప్పాడు. డిసెంబర్ మొదటి వారం వచ్చేసినా ఇంకా షూటింగ్ ను పూర్తి చేయలేదు. మరికొన్ని రోజులు షూటింగ్ చేయాల్సి ఉంది. దాని తర్వాత కనీసం 15 రోజులు ప్రమోషన్స్ కోసం కేటాయించాలి. అప్పటికి ఎలాగో అల వైకుంఠపురములో రిలీజ్ టైమ్ వచ్చేస్తుంది. దాని తర్వాత సుకుమార్ సినిమా కోసం ప్రేపరేషన్. ఇలా అన్నీ చూసుకుంటే జనవరి చివరి వారానికి కానీ సుకుమార్ సినిమాను మొదలుపెట్టలేడు.

ముందు అనుకున్న దాని ప్రకారమైతే డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ మొదలుపెట్టి, అల వైకుంఠపురములో రిలీజ్ కు ముందుకల్లా ఒక షెడ్యూల్ ను పూర్తి చేయాలి. అప్పుడైతే లేట్ సమ్మర్ రిలీజ్ కు వెళ్లిపోవచ్చు. అలా అయితే సుకుమార్ తర్వాతి సినిమాను మళ్ళీ సంక్రాంతికి దించేయొచ్చు. ఇంత ప్లాన్ వేసుకున్నాడు. కానీ ఇప్పుడు జనవరి చివరికి కానీ సుకుమార్ సినిమా మొదలయ్యే అవకాశాలు లేకపోవడంతో, సుక్కూ టేకింగ్ స్పీడ్ ను దృష్టిలో పెట్టుకుని చూస్తే లేట్ సమ్మర్ రిలీజ్ అనేది జరగని పని. ఎంత స్పీడ్ గా తీసినా ఆగష్టులో రిలీజ్ చేసుకోవాలి. లేదా దసరాకు వెళ్ళాలి.

మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్ల అల్లు అర్జున్ ప్లానింగ్ మొత్తం తలకిందులు అయిపోయింది. ఇక అల వైకుంఠపురములో విషయానికి వస్తే ఇది జనవరి 12న విడుదలకానున్న విషయం తెల్సిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలూ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెల్సిందే. త్వరలోనే టీజర్ విడుదల కానుంది.