పబ్లిసిటీ విషయంలో బన్నీ కుమ్మేస్తున్నాడుగా



పబ్లిసిటీ విషయంలో బన్నీ కుమ్మేస్తున్నాడుగా
పబ్లిసిటీ విషయంలో బన్నీ కుమ్మేస్తున్నాడుగా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫలితం తర్వాత చాలా మధనపడ్డాడు. ఈ సినిమా విజయం సాధిస్తుందని బాగా నమ్మాడు బన్నీ. అందుకే ఎప్పుడూ లేనంత ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. అయితే చివరికి నా పేరు సూర్య సినిమా పరాజయం పాలైంది. దాంతో బన్నీ దాదాపు ఆరు నెలలు బయటకు రాలేదు. ఏడాది పాటు తన తర్వాతి సినిమాను మొదలుపెట్టలేదు. అయితే చివరికి తనకు రెండు సూపర్ హిట్లు ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జత కట్టాడు. అల వైకుంఠపురములో అనే ఫన్ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తున్నాడు. నా పేరు సూర్యలో ఫన్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయని టాక్ వచ్చిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఈసారి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ విషయంలో ఎక్కడా కొదవ రాకుండా చూసుకుంటున్నాడు. అలాగే పబ్లిసిటీ విషయంలో కూడా బన్నీ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు.

ఇప్పటికే అల వైకుంఠపురములో విషయంలో బన్నీ చాలా పర్సనల్ గా తీసుకుని ప్రమోషన్స్ చూసుకుంటున్నాడు. సాధారణంగా హీరోలు ప్రమోషన్స్ ఎలా చేయాలన్న విషయంలో ఇంతలా మధనపడిపోరు. దానికి ప్రత్యేకంగా పిఆర్ టీమ్ ఉంటుంది. వాళ్లకు లక్షలకు లక్షలు బడ్జెట్ కూడా పెడుతుంటారు. స్పైడర్ సినిమా తర్వాత మహేష్ ఇలానే తన కోసం ఒక పిఆర్ టీమ్ ను సెట్ చేసుకున్న విషయం తెల్సిందే. తన ప్రమోషన్స్ వ్యవహారాలు అన్నీ ఆ టీమ్ చూసుకుంటుంది. అయితే బన్నీ ఈ విషయంలో పిఆర్ టీమ్ పని పెద్దగా లేకుండా తానే కేర్ తీసుకుంటున్నాడు. నిర్మాత, దర్శకుడికి సగం పని తగ్గించేస్తున్నాడు. ఇప్పటికే అల వైకుంఠపురములో ప్రమోషన్స్ జరుగుతున్న తీరు మనం చూస్తూనే ఉన్నాం. సినిమా విడుదలకు నాలుగు నెలలు ముందు నుండే హడావిడి మొదలుపెట్టేశాడు బన్నీ. మొదట దింపడమే సామజవరగమన విడుదల చేయడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరీ ఆలస్యం చేస్తే వచ్చిన బజ్ పోతుందని గ్రహించి వెంటనే సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ చేసేయమని థమన్ ను ఆదేశించాడు. ఈ నిర్ణయాలు సినిమాకు ఎంతలా హెల్ప్ అయ్యాయో అందరికీ తెల్సిందే.

ఇలా అల వైకుంఠపురములో విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. సాంగ్ షూట్స్ కు వెళితే ఏ లొకేషన్ లో షూట్ చేస్తే ప్రచారం దక్కుతుందో కూడా బన్నీనే సలహాలు ఇచ్చాడట. అలాగే పాటలు విడుదల చేసేటప్పుడు అవి మ్యూజికల్ వీడియోస్ గా చేయమన్నది కూడా బన్నీ ఐడియానే. ఇకపోతే అల వైకుంఠపురములో చిత్రం విషయంలోనే కాకుండా బన్నీ తన తర్వాతి సినిమాకు కూడా ప్రమోషన్స్ అప్పుడే మొదలుపెట్టేశాడు. సుకుమార్ తో బన్నీ తన తర్వాతి చిత్రం చేయబోతున్న సంగతి తెల్సిందే. అందుకే బన్నీ ఆర్య 2 పదేళ్లు పూర్తైన సందర్భాన్ని వాడేసుకున్నాడు. సుకుమార్ తో ఒక ఫోటో దిగి తమలో పర్సనల్ గా మార్పులు వచ్చాయి కానీ మేమిద్దరం కలిస్తే ఉండే ఫైర్ ఇంకా తగ్గలేదని త్వరలోనే చూస్తారన్న తరహాలో వ్యాఖ్యానించి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసాడు.