బన్నీ సినిమాకు కూడా అదే థీమ్ వాడుతున్న సుక్కూ


బన్నీ సినిమాకు కూడా అదే థీమ్ వాడుతున్న సుక్కూ
బన్నీ సినిమాకు కూడా అదే థీమ్ వాడుతున్న సుక్కూ

సుకుమార్ కు తెలుగు ఇండస్ట్రీలో క్రియేటివ్ దర్శకుడిగా పేరుంది. తన సినిమాల్లో స్క్రీన్ ప్లే విభిన్నంగా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలని పెర్ఫెక్ట్ గా చూపిస్తాడు సుక్కూ. ఒక్కోసారి కొత్తదనం ఎక్కువై సినిమాలు ప్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే 1 నేనొక్కడినే ప్లాప్ తర్వాత నుండి ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యేలా స్క్రీన్ ప్లే రాసుకోవడం మానేసాడు సుకుమార్. అది కాకుండా రివెంజ్ ఫార్మాట్ లో సినిమాలు రూపొందించడం మొదలుపెట్టాడు. ప్రతి సినిమాలో రివెంజ్ ప్రధానంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ ఫార్మాట్ భలే వర్కౌట్ అవుతోంది.

1 నేనొక్కడినేలో రివెంజ్ థీమ్ ఉన్నా కానీ స్క్రీన్ ప్లే కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అసలు ఏది నిజమో, ఏది అబద్ధమో అటు హీరోతో పాటు, ఆడియన్స్ కూడా అయోమయానికి గురవుతారు. అందుకే సినిమా ఫెయిల్ అయింది. థియేటర్లలో చూడని జనాలు తర్వాత దీన్నో కల్ట్ సినిమాగా పేర్కొనడం మొదలుపెట్టారు. అయితే ఈ సినిమా తర్వాత సుకుమార్ రూపొందించిన నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాల్లో రివెంజ్ థీమ్ ను కొనసాగడం విశేషం. నాన్నకు ప్రేమతో సినిమా రివెంజ్ అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో సాగిపోతుంది. ఇక రంగస్థలం సినిమాలో ఆఖర్లో వచ్చే ట్విస్ట్ జనాలకు భలే థ్రిల్ ఇచ్చింది.

ఇక ఇప్పుడు సుకుమార్ అల్లు అర్జున్ సినిమా కూడా రివెంజ్ థీమ్ తోనే సాగుతుందని తెలుస్తోంది. అవ్వడానికి ఇది ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ అయినా కూడా ఈ సినిమాలో అండర్ లయింగ్ గా రివెంజ్ థీమ్ ఉంటుందని, హీరో తనకు జరిగిన అన్యాయానికి తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకుంటాడని తెలుస్తోంది. ఇలా వరసగా సుకుమార్ రివెంజ్ థీమ్ ను వాడుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమా షూటింగ్ నల్లమల అడవుల్లో జరగాలని తొలుత భావించినా అక్కడ రవాణా, ఫోన్ సిగ్నల్, ఫుడ్ తదితర ఇబ్బందులు ఉన్న కారణంగా షూటింగ్ ను బ్యాంకాక్ అడవుల్లో జరపాలని నిర్ణయించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.