బన్నీ – సుకుమార్ సినిమా విడుదల కన్ఫర్మ్ అయిందా? Allu Arjun Sukumar movie gets tentative release date
Allu Arjun Sukumar movie gets tentative release date

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా అల వైకుంఠపురములో ఎంత పెద్ద హిట్టయ్యిందో మనందరం చూసాం. బాహుబలి రికార్డులను తప్పించి తెలుగు సినిమాల వరకూ ఉన్న అన్ని రికార్డులను ఈ చిత్రం తిరగరాసింది. ఇంకా డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. వారాంతాల్లో ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో జనాదరణ పొందుతుండగా, వర్కింగ్ డేస్ లో కూడా దాదాపు 60 శాతం ఆక్యుపెన్సీతో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్లందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక అల్లు అర్జున్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి తన తర్వాతి సినిమాపై ఫోకస్ పెట్టాడు.

బన్నీ సుకుమార్ తో సినిమా చేయనున్న విషయం తెల్సిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు ఇప్పటికే సమాచారమందింది. రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి మొదలుకానున్నట్లు సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్ తన లుక్స్, డిక్షన్ పై దృష్టి పెట్టాడు. చిత్తూర్ స్లాంగ్ ను సరిగ్గా పలకడానికి స్పెషల్ ట్యూటర్ ను కూడా పెట్టుకున్నాడు. ఇటీవలే సుకుమార్ కేరళ అడవుల్లో అల్లు అర్జున్ లేకుండా ఒక వారం పాటు చిన్న చిన్న సీన్స్ ను చిత్రీకరించుకుని వచ్చిన విషయం తెల్సిందే.

ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రపై రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెట్టి శరవేగంగా చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ లో ఈ సినిమా విడుదల ఉండనుందని తెలుస్తోంది. ముందుగా అక్టోబర్ లో ఈ సినిమాను విడుదల చేయాలని భావించినా అదే నెలలో ఆర్ ఆర్ ఆర్ విడుదల ఉంటుందని వార్తలు వస్తున్నాయి కాబట్టి సెప్టెంబర్ ను టార్గెట్ గా పెట్టుకుని సినిమా షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించనుంది. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.