చిక్కుల్లో మెగాస్టార్ సినిమా!


చిక్కుల్లో మెగాస్టార్ సినిమా!
చిక్కుల్లో మెగాస్టార్ సినిమా!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం `జుండ్‌`. మ‌రాఠీ చిత్రం సైరాఠ్‌`తో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన నాగ‌రాజ్ మంజులే ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. టి. సిరీస్ సంస్థ నిర్మించింది. స్ల‌మ్ సాక‌ర్ అఖిలేష్ పాల్ జీవిత క‌థ ఆధారంగా స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రంపై హైద‌రాబాదీ ర‌చ‌యిత చిన్నికుమార్ కోర్టులో కేస్ ఫైల్ చేశారు.

ఈ చిత్ర క‌థ త‌న‌దే నంటూ, దీనికి సంబంధించిన రైట్స్ త‌న వ‌ద్దే వున్నాయ‌ని మియాపూర్ 15వ అద‌న‌పు జిల్లా కోర్టులో పిటీష‌న్ దాఖ‌‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ కేసులో అమితాబ్ బ‌చ్చ‌న్‌, టీ సిరీస్‌, నాగ‌రాజ్ మంజులే, నెట్ ఫ్లిక్స్‌ల‌ను ప్ర‌తి వాదులుగా చేర్చారు. అయితే దీనిపై చిత్ర బృందం కూడా ఘాటుగానే స్పందించింది.

తాను ఎలాంటి కాపీకి పాల్ప‌డ‌లేద‌ని, ప్ర‌జా జీవితంలో ప్రాచూర్యంలో వున్న సంఘ‌ట‌న‌ల‌నే తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించామ‌ని కౌంట‌ర్ పిటీష‌న్‌ని దాఖ‌‌లు చేసింది. దీనికి చిన్నికుమార్ కూడా ధీటుగా స్పందించాడు. త‌ను అఖిలేష్ పాల్ జీవిత క‌థ హ‌క్కుల్ని సొంతం చేసుకున్నాన‌ని, అయితే విజ‌య్ బ‌ర్సే అనే వ్య‌క్తి నుంచి ఇవే హ‌క్కుల్ని `జుండ్‌` మూవీ టీమ్ అక్ర‌మంగా కొనుగోలు చేసింద‌ని చిన్నికుమార్ కోర్టుకు స్ప‌ష్టం చేశారు. దీంతో ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న కోర్టు త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 28కి వాయిదా వేసింది. దీంతో ఈ సినిమా రిలీజ్ ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డిపోయింది.