అమ్మ రాజ్యంలో మళ్ళీ వాయిదా పడింది!


Amma rajyamlo kadapa biddalu postponed again
Amma rajyamlo kadapa biddalu postponed again

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు రిలీజ్ సమస్యలను ఎదుర్కొంటోంది. ముందుగా ఈ చిత్రాన్ని వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ తో తెరకెక్కించారు. తనకు వివాదాలు సృష్టించడం బాగా ఇష్టం కావడంతో టైటిల్ దగ్గర్నుండి, తీసుకున్న కాన్సెప్ట్, అందులో ఎంచుకున్న నటులు ఇలా అన్నిట్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసాడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్, కెఏ పాల్ లను పోలి ఉన్న క్యారెక్టర్ లు పెట్టి వారిపై పంచ్ లు వేయించి వివాదం సృష్టించాడు రామ్ గోపాల్ వర్మ. ఎందుకిలా అని అడిగితే అదేంటి నా క్యారెక్టర్ లు అచ్చం రియల్ లైఫ్ నాయకులలా ఉన్నాయి అని అమాయకంగా ఫేస్ పెట్టాడు. అయితే మీడియా ముందు సాగిన ఆటలు సెన్సార్ ముందు సాగలేదు.

నిజానికి ఈ సినిమాను నవంబర్ 29న విడుదల చేయాలనుకున్నారు. అయితే సెన్సార్ వాళ్ళు సర్టిఫికెట్ ఇష్యూ చేయని కారణంగా అప్పటికి వాయిదా పడింది. తర్వాత డైలాగ్ మార్చి కొన్ని సన్నివేశాలకు మ్యూట్ వేసి మళ్ళీ సెన్సార్ ముందుకు తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో అమ్మ రాజ్యంలో టీమ్ కోర్టుకెక్కింది. తమ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ కావాలనే ఇవ్వట్లేదని, కోర్టు కలగజేసుకుని సత్వరమే సర్టిఫికేట్ వచ్చేలా చేయాలని కోర్టును కోరింది. అయితే దీనిపై కౌంటర్ ఫైల్ చేసిన సెన్సార్ బోర్డు, కోర్టులో తన వాదనలను గట్టిగా వినిపించింది. టైటిల్ మార్చి, కొన్ని సన్నివేశాలకు మ్యూట్ వేసినంత మాత్రాన సెన్సార్ అవ్వదని కోర్టుకు తెలియజేసింది. అధ్యాంతరకర సన్నివేశాలను తొలగిస్తేనే సెన్సార్ చేయగలమని స్పష్టం చేసింది.

ఈ వాదనలతో కోర్టు సెన్సార్ బోర్డుతో ఏకీభవించింది. సెన్సార్ విషయంలో కోర్టు జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు రిలీజ్ రేపు ఉండబోదు. రివ్యూ కమిటీ సినిమాను చూసి సెన్సార్ వారికి సిఫార్సు చేస్తే అప్పుడు సెన్సార్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి అది ఎప్పటికి జరుగుతుందో.