కోరి కాంట్రవర్సీ కొని తెచ్చుకున్న అనసూయ


anasuya tweets on lock down draws controversy
anasuya tweets on lock down draws controversy

సోషల్ మీడియాలో హాట్ యాంకర్ అనసూయ ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. ఈ భామ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలతో నెటిజన్లకు ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. దాంతో పాటు సమాజంలో జరిగే పలు విషయాలపై స్పందిస్తూ ఉండడం కూడా అలవాటే. దీని వల్ల ఒక్కోసారి పాజిటివ్ గా రియాక్ట్ అయినా కానీ ఒక్కోసారి చివాట్లు పడుతుంటాయి. ప్రస్తుతం అలాంటి సంఘటనే అనసూయకు కూడా జరిగింది.

కరోనా వైరస్ ప్రభావం విస్తృతమవుతున్న వేళ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెల్సిందే. నిన్న రాత్రి నుండి అది అమల్లోకి రాగా ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సహాయం గురించి మంత్రి కేటీఆర్ ట్వీట్ పెట్టగా దానికి అనసూయ కొంచెం మా గురించి కూడా ఆలోచించండి అన్న అర్ధం వచ్చేలా పెట్టిన ట్వీట్ పలు విమర్శలకు తావిస్తోంది. ఇంతకీ ఆమె ఏం ట్వీట్ చేసిందంటే..

“ప్రభుత్వానికి కట్టుబడి ఉంటూనే ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నా.. మేము పనిచేస్తేనే మాకు డబ్బులు వస్తాయి. ఇప్పుడున్న లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా ఇప్పుడు పనికి వెళ్లకపోతే మేము నెల చివర్లో కట్టాల్సిన ఈఎంఐలు, కరెంటు బిల్స్, ఇంటి రెంట్ వైగరా ఖర్చులకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనికి కూడా ఏదైనా పరిష్కారం చూడండి” అని ట్వీట్ చేయగా దానికి నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

ఒక్కో ఈవెంట్ కోసం లక్షల్లో పారితోషికం తీసుకునే అనసూయ ఇలా బీద అరుపులు అరవడం ఏమిటంటూ కొందరు ప్రశ్నించారు. మీరే అలా మాట్లాడితే మా పరిస్థితి ఏంటి అంటూ కొందరు ప్రశ్నించారు. అయితే అనసూయ ట్వీట్ అర్ధం వేరేది అని తర్వాత క్లారిటీ ఇచ్చింది. రోజూ వారి జీతానికి పనిచేసే లైట్ బాయ్స్ వంటి వారి గురించి నేను స్పందించానని, అయినా ఎంత చెట్టుకి అంత గాలి అని, తనకు వచ్చే పారితోషికానికి తగ్గట్లే ఖర్చులు కూడా ఉంటాయని తెలిపింది అనసూయ.