అనిల్ రావిపూడి ఒత్తిడిలో ఉన్నాడా?


అనిల్ రావిపూడి ఒత్తిడిలో ఉన్నాడా?
అనిల్ రావిపూడి ఒత్తిడిలో ఉన్నాడా?

సెటైర్ ఎవరిమీదైనా ఎప్పుడు వేస్తారు? ఒకటి సరదాగా వేస్తారు లేదా వాళ్ళు మనకన్నా పైకి వెళ్తున్నారన్న భావనలో ఉన్నప్పుడైనా వేస్తారు. రీసెంట్ గా అనిల్ రావిపూడి కూడా అల వైకుంఠపురములో టీమ్ మీద ఒక సెటైరికల్ వీడియో పోస్ట్ చేసాడు. వారి మీద పంచ్ వేసేంత చనువు అనిల్ రావిపూడికి లేదు. మరింకెందుకు వేసాడనుకోవాలి, కచ్చితంగా అల వైకుంఠపురములో టీమ్ ప్రమోషనల్ దూకుడుకు ఒత్తిడికి గురై అనిల్ రావిపూడి ఈ విధంగా స్పందించాడు అని ఇండస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయి. అనిల్ ఒత్తిడిలోకి వెళ్ళడానికి పెద్ద కారణమే ఉంది. ఇప్పటిదాకా అనిల్ రావిపూడి తీసిన సినిమాలన్నీ విజయవంతమైనవే. మొదటి సినిమా పటాస్ నుండి రీసెంట్ సినిమా ఎఫ్ 2 వరకూ అన్నీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ చిత్రాలే. అయినా కానీ అనిల్ రావిపూడి తన లేటెస్ట్ సినిమాకు ఒత్తిడికి గురవుతున్నాడు. దీనికి కారణం ఇప్పటివరకూ అనిల్ రావిపూడి మహేష్ బాబు వంటి స్టార్ హీరోని హ్యాండిల్ చేయకపోవడమే. నందమూరి కళ్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్, రవితేజ, వెంకటేష్, వరుణ్ తేజ్.. ఇలా అందరూ మీడియం రేంజ్ హీరోలే. తొలిసారి భారీ మార్కెట్ ఉన్న హీరోని హ్యాండిల్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. దాదాపు 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాను ఇంతకుముందెన్నడూ హ్యాండిల్ చేయలేదు పైగా మార్కెట్ లో భీభత్సమైన పోటీ ఉంది.

అటువైపు ఉన్నది త్రివిక్రమ్ శ్రీనివాస్. స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడంలో ఆరితేరిన వాడు. పైగా అల వైకుంఠపురములో ప్రమోషన్స్ విషయంలో చెలరేగిపోతోంది. ఒకదాన్ని మించి మరొకటి పాటలు సూపర్ హిట్ కావడం అనిల్ రావిపూడికి మింగుడు పడడం లేదు. మొదట సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు ఒకేరోజు రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడు మహేష్ కన్నా అల్లు అర్జున్ కు ఇది ఎఫెక్ట్ అవుతుందనుకున్నారంతా. అయితే ఇప్పడు పరిస్థితిలో పూర్తిగా మార్పొచ్చింది. ప్రస్తుతం మార్కెట్ లో క్రేజియస్ట్ ప్రాజెక్ట్ అంటే అల వైకుంఠపురములో అనే చెప్పాలి. ఈ లెక్కలతో నిర్మాతల వైపు నుండి కూడా అనిల్ రావిపూడికి ఒత్తిడి ఉంది. అందుకే ఆ వీడియో వదిలాడు.

ప్రమోషన్స్ పరంగా సరిలేరు నీకెవ్వరు సైలెంట్ గా ఉండడానికి కారణం కూడా ఉంది. వాళ్ళ దగ్గర అంత క్రేజీ పాటలు లేవు. చాలా ముందుగా రిలీజ్ చేస్తున్నప్పుడు ఇన్స్టంట్ హిట్స్ కావాలి. కానీ సరిలేరు నీకెవ్వరులో పాటలు స్లో పాయిజన్ లా ఎక్కుతాయిట. అందుకే ముందు దీపావళికి పాట విడుదల చేద్దామనుకుని కూడా పోస్టర్స్ తో సరిపెట్టారు. ఒకవేళ విడుదల చేసి ఉంటే రాములో రాముల ముందు ఆ పాట నిలవగలదా అంటే అనుమానమే. సినిమా పరంగా కూడా సరిలేరు నీకెవ్వరులో కొత్తదనమేం లేదు. కేవలం ఎంటర్టైన్మెంట్ ను నమ్ముకుని వెళుతున్నారు. ఎప్పుడో వెంకీలో వాడేసిన ట్రైన్ ఎపిసోడ్, ఒక్కడులో సూపర్ హిట్ అయిన కొండారెడ్డి బురుజు సెంటర్ ఫైట్ వంటి ఆకర్షణలు సరిలేరు నీకెవ్వరుకి ఎంతవరకూ ప్లస్ అవుతాయన్నది అనిల్ రావిపూడి మదిలో మెదులుతున్న అనుమానం. అందుకే ఇప్పుడు అతను ఒత్తిడిలో ఉన్నాడు.