చిరు ఊ అనాలే కానీ..: అనిల్ రావిపూడిచిరు ఊ అనాలే కానీ..: అనిల్ రావిపూడి
చిరు ఊ అనాలే కానీ..: అనిల్ రావిపూడి

కమర్షియల్ మీటర్ తెలిసిన దర్శకుడిగా అనిల్ రావిపూడికి ఇండస్ట్రీలో మంచి పేరుంది. చేసిన నాలుగు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. ఇక ఐదో సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. దర్శకుడిగా అనిల్ రావిపూడి ప్రతి సినిమాకు ఒక్కో మెట్టూ ఎక్కుతూ ముందుకు వెళ్ళాడు. తన మొదటి పటాస్ ను చాలా తక్కువ బడ్జెట్ లో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కించాడు.

అది సూపర్ హిట్ అయింది. రెండో సినిమా సుప్రీమ్ కు మరో మెట్టు ఎక్కి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో తెరకెక్కించాడు. అది కూడా సూపర్ హిట్టే. ఇక మూడో సినిమా రవితేజ హీరోగా రాజా ది గ్రేట్. ఈ సినిమా ఫలితం కూడా తెలిసిందే. నాలుగో సినిమా వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్ 2. ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఐదో సినిమా ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ బడ్జెట్ లో తీసాడు. అదే సరిలేరు నీకెవ్వరు. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్ర విడుదల సందర్భంగా అనిల్ రావిపూడి పలు విషయాలపై స్పందించాడు. తన తర్వాతి సినిమా విషయంలో ఇంకా ఏం తేల్చుకోలేదని చెప్పాడు. సినిమా, సినిమాకు ఎదుగుతున్నాడు కాబట్టి తన తర్వాతి చిత్రం మెగాస్టార్ తో ఉంటుందా అని కొంత మంది సరదాగా అన్నా ఆ విషయం అనిల్ వరకూ చేరింది. చిరు ఊ అనాలే కానీ సినిమా చేయడం ఎంతసేపు అంటున్నాడు ఈ దర్శకుడు. చిరంజీవి కంటూ స్క్రిప్ట్ ఏం సిద్ధంగా లేదని, కానీ చిరు నుండి పిలుపొస్తే నాలుగైదు నెలల్లో పూర్తి స్క్రిప్ట్ తో తన ముందు వాలిపోతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

ఇక నందమూరి బాలకృష్ణతో సినిమా గురించి రూమర్లపై స్పందిస్తూ, బాలకృష్ణతో ‘రామారావు’ అనే సినిమా చేయాలనుకున్న మాట వాస్తవమేనని, అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదని తెలిపాడు రావిపూడి.