సరికొత్త ప్రపంచంలో ఎఫ్ 3.. అనిల్ రావిపూడి ప్రకటనAnil Ravipudi reveals details about F3
Anil Ravipudi reveals details about F3

సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సూపర్ హిట్ కొట్టేసాడు అనిల్ రావిపూడి. తన కెరీర్ లో అపజయమన్నది ఎరుగని ఈ దర్శకుడు ఇప్పటిదాకా ఐదు సినిమాలను తీస్తే ఐదూ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడం విశేషం. తన తొలి సినిమా నుండీ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వెళ్లిన అనిల్ రావిపూడి ఎఫ్ 2 సాధించిన సక్సెస్ తో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నాడీ మాస్ డైరెక్టర్. ప్రేక్షకుల అభిరుచుల్ని చక్కగా ఒడిసిపట్టుకోగలడన్న పేరు సంపాదించుకున్న రావిపూడి, మహేష్ అభిమానులు తమ హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూపించాడు.

గత కొన్ని సినిమాలుగా ప్యాసివ్ యాక్టింగ్ వైపు వెళ్లిపోయిన మహేష్ ను ఫుల్ జోష్ లో చూపించాడు. అలాగే మహేష్ చేత డ్యాన్స్ లు వేయించాడు. దీంతో మహేష్ అభిమానులు పూర్తిగా రావిపూడికి ఫిదా అయిపోయారు. తమ హీరోతో మళ్ళీ సినిమా ఎప్పుడని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అనిల్ రావిపూడికి మధ్యలో ఒక కమిట్మెంట్ ఉందని, అది అవ్వగానే మళ్ళీ ఇద్దరం కలిసి పనిచేస్తామని ప్రకటించాడు మహేష్ బాబు.

ఆ కమిట్మెంట్ ఏంటో వేరే చెప్పాల్సిన పనిలేదుగా. తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన విశేషాల్ని పంచుకున్నాడు. ఎఫ్ 3, ఎఫ్ 2 కు సీక్వెల్ కాదని, కథలో కంటిన్యూ అవ్వడం ఏం ఉండదని, ఎఫ్ 3 అంతా కొత్త ప్రపంచంలో ఉంటుందని.. ఎఫ్ 2కి ఎఫ్ 3కి అసలు సంబంధం ఉండదని చెప్పాడు. అలాగే ఇందులో హీరో, హీరోయిన్లు నలుగురు కంటిన్యూ అవుతారని రివీల్ చేసాడు. అలాగే రాజేంద్ర ప్రసాద్ పాత్ర కూడా ఉంటుందని, తను లేకుండా సినిమా చేయలేనని అన్నాడు అనిల్ రావిపూడి. మొదటి సినిమా పెళ్లి, ఫ్రస్ట్రేషన్ మీద ఉంటే ఎఫ్ 3 లో కెరీర్, గోల్స్ గురించి ఉంటుందని రివీల్ చేసాడు. ఎఫ్ 3 అంటే ఫన్, ఫ్రస్ట్రేషన్ అండ్ మోర్ ఫన్ అని చెప్పాడు అనిల్ రావిపూడి.