సరిలేరు నీకెవ్వరు కథ ఎలా పుట్టింది?


Anil Ravipudi reveals inspiration behind Sarileru Neekevvaru
Anil Ravipudi reveals inspiration behind Sarileru Neekevvaru

సినిమా తెరకెక్కాలంటే ముందుగా కుదరాల్సింది కథే. సినిమాలో ఎంత మంది స్టార్ నటులను పెట్టుకుని, ఎంత మంది సాంకేతిక నిపుణులను తీసుకుని ఎంత హడావిడి చేసినా కానీ కథ లేనిదే ఈ ప్రాజెక్ట్ ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళదు. మరి కథ ఎలా పుడుతుంది? ఎలాగైనా పుట్టొచ్చు. అయితే కథ పుట్టడానికి ప్రధానంగా స్ఫూర్తి పొందడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మన చుట్టూ జరిగే సంఘటనలనో, మన దగ్గరి వ్యక్తులనో, సమాజంలో జరిగే సంఘటనలనో స్ఫూర్తిగా తీసుకుని కథలు అల్లుతారు రచయితలు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా ఇలా స్ఫూర్తి పొందే పుట్టిందిట. ఈ కథ పుట్టడం వెనుక ఒక ఆసక్తికర సంఘటన దాగుందని అంటున్నాడు సరిలేరు నీకెవ్వరు దర్శకుడు అనిల్ రావిపూడి.

ఇటీవలే మీడియాతో ఈ  విషయాలను పంచుకున్నాడు. కొన్ని నెలల క్రితం ట్రైన్ జర్నీ చేస్తున్న తనకు ఒక సైనికుడు తగిలాడట. ఖాళీగా ఉండడంతో తను కూడా ఆ సైనికుడితో మాట కలిపాడట. ఆ సైనికుడు బోర్డర్ నుండి ఇంటికి వస్తున్నాడట. ఆ సైనికుడిలో సంభాషిస్తున్నంత సేపూ ఆ సైనికుడి ఆలోచన మొత్తం డ్యూటీ మీదే ఉందని, వారు సెలవుల్లో ఇంటికి వెళ్లినా కూడా వారి ఆలోచన డ్యూటీ మీదే ఉంటుందని తెలిపాడు అనిల్ రావిపూడి.

సైనికులపట్ల అందరిలో ఒక అపోహ ఉంటుందని, వారికి భావోద్వేగాలు మనలాగా ఉండవని అంటుకుంటారని, అయితే సైనికులకూ భావోద్వేగాల విషయంలో తక్కువేం కాదని, మనలాగే వారి ఆలోచన కూడా ఉంటుందని, అయితే సమాజం పట్ల వారికి కన్సర్న్ మరింత ఎక్కువ ఉంటుందని, ఈ అంశాలకు ఇన్స్పైర్ అయ్యే తాను ఇందులో మహేష్ బాబు పాత్రను తీర్చిదిద్దినట్లు అనిల్ రావిపూడి చెబుతున్నాడు. సరిలేరు నీకెవ్వరు ప్రతి సైనికుడికి తామిచ్చే ట్రిబ్యూట్ అని అనిల్ రావిపూడి అంటున్నాడు. ఒకవైపు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూనే మరోవైపు కమర్షియల్ విలువలు ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమా అన్ని వర్గాల వారిని అలరిస్తుందన్న నమ్మకం ఉందని అంటున్నాడు దర్శకుడు. మహేష్ బాబులో ఈ మధ్య మిస్ అయిన మాస్ యాంగిల్, కామెడీ అన్నీ ఈ సినిమాలో ఉంటాయని చెబుతున్నాడు. మహేష్ ఫ్యాన్స్ కు ఈ చిత్రం ఒక ట్రీట్ లా ఉంటుందని, పండగకి చూడాల్సిన కరెక్ట్ సినిమాగా సరిలేరు నీకెవ్వరు గురించి నమ్మకంగా ఉన్నాడు అనిల్ రావిపూడి.