రావిపూడి మాత్రం వెనక్కి తగ్గనంటున్నాడు, నిజమేనా?


Anil Ravipudi to clash with Rajamoulis RRR
Anil Ravipudi to clash with Rajamoulis RRR

ఈ సంక్రాంతికి రెండు భారీ సినిమాలు విడుదలై సూపర్ డూపర్ హిట్స్ సాధించడంతో వచ్చే సంక్రాంతి మీద టాలీవుడ్ బడా సినిమాలకు ఆశ పుట్టింది. అయితే వారందరి ఆశలపై నీళ్లు జల్లుతూ జక్కన్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ను జనవరి 8న సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే. దీంతో సంక్రాంతి వద్దామని ప్రణాళికలు వేసుకున్న అందరూ తమ తమ షెడ్యూల్స్ ను మార్చుకోవడం మొదలుపెట్టారు. పోయి పోయి రాజమౌళితో క్లాష్ ఎందుకని వేరే బెస్ట్ సీజన్ ను చూసుకుని దాని ప్రకారం తమ షూటింగ్స్ ను షెడ్యూల్ చేసుకుంటున్నారు. అయితే ఒక్క దర్శకుడు మాత్రం తాను ఈ విషయంలో ఎక్కడా తగ్గనంటున్నాడని సమాచారం. అతనే అనిల్ రావిపూడి.

ఇప్పటివరకూ చేసిన ఐదు సినిమాలు సూపర్ డూపర్ హిట్లు. ఒకదాన్ని మించి ఒక సినిమా హిట్ తో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. అందులోనూ లాస్ట్ 2 సంక్రాంతులకు తన సినిమాలను విడుదల చేసి సంక్రాంతి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. 2019 సంక్రాంతికి ఎఫ్ 2, 2020 సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సరిలేరు నీకెవ్వరు వచ్చి సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఈ నేపథ్యంలో మూడోసారి సంక్రాంతికి వచ్చి హ్యాట్రిక్ పూర్తిచేయాలని భావించాడు. దీంతో తన కెరీర్ లో కూడా డబల్ హ్యాట్రిక్ పూర్తవుతుంది. అయితే ఈలోగా ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ ప్రకటన వచ్చింది.

అయినా కూడా సంక్రాంతికి తాను కూడా వస్తానని సన్నిహితుల వద్ద అంటున్నట్లు భోగట్టా. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 స్క్రిప్టింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ జూన్ నుండి మొదలయ్యే అవకాశాలున్నాయి. అనిల్ స్పీడ్ గురించి తెలిసిందే. అతను తల్చుకుంటే జూన్ నుండి మొదలుపెట్టి వచ్చే సంక్రాంతికి సినిమాను దింపడం పెద్ద కష్టమైన పనేం కాదు.

ఆర్ ఆర్ ఆర్ ఉన్నా కానీ మరో సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశముందని, ఆర్ ఆర్ ఆర్ 8నే వస్తోంది కాబట్టి 14 లేదా 15 తారీఖుల్లో తన సినిమా వస్తే పెద్ద రిస్క్ ఉండదని భావిస్తున్నాడు రావిపూడి. దాని ప్రకారం ఇప్పటినుండే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో.