ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించిన ఆసక్తికర అప్డేట్


another interesting update from rrr
another interesting update from rrr

జక్కన్న రాజమౌళి తెలుగులో దర్శక ధీరుడిగా పేరొందాడు. అపజయమన్నది ఎరుగని రాజమౌళి బాహుబలి వంటి సూపర్ సక్సెస్ తర్వాత టాలీవుడ్ లో ఇద్దరు టాప్ రేంజ్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ లను హీరోలుగా పెట్టి ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలోనూ, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలోనూ కనిపిస్తారు. ఈ ఇద్దరు విప్లవ వీరులు వారి యవ్వనంలో కొన్నాళ్ళు ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయారు. ఆ సమయంలో ఏం జరిగిందో రాజమౌళి తనదైన శైలిలో ఫిక్షన్ ను జోడించి తీర్చిదిద్దుతున్నాడు. ఇద్దరు స్టార్ హీరోల చిత్రం కావడంతో రాజమౌళి చాలా జాగ్రత్తగా ఈ చిత్రాన్ని డీల్ చేస్తున్నాడట. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ను సంతృప్తిపరిచేలా సినిమా ఉంటుందిట. పైకి కథ ప్రకారమే వెళుతున్నాం అని చెబుతున్నా రాజమౌళి హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో దిట్ట అన్న విషయం తెల్సిందే. అందుకే ఈ చిత్రంలో కూడా ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే రేంజ్ ఎలివేషన్స్ పెట్టాడట.

ఇప్పటికే ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ గురించి, అందులో యంగ్ టైగర్ పెర్ఫార్మన్స్ గురించి, వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. రామ్ చరణ్ గతంలో సైరా ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉండడంతో ఎన్టీఆర్ తో కొన్ని సీన్స్ ను చిత్రీకరించాడు రాజమౌళి. ఇందుకోసం టీమ్ బల్గేరియా వెళ్లి మరీ షూట్ చేసుకుని వచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు రామ్ చరణ్ తిరిగి ఆర్ ఆర్ ఆర్ సెట్స్ లో జాయిన్ అవ్వడంతో ఇద్దరు హీరోలు కలిసి ఉన్న సీన్స్ ను చిత్రీకరిస్తున్నాడట. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. రామ్ చరణ్ పాల్గొంటుండగా ఏవో కోర్ట్ రూమ్ సీన్స్ ను స్పెషల్ సెట్ వేసి షూట్ చేస్తున్నారట. అయితే ఇందులో ఎన్టీఆర్ ఉన్నాడా లేదా అన్నది తెలియలేదు.

ఆర్ ఆర్ ఆర్ ను జులై 30, 2020న విడుదల చేస్తానని రాజమౌళి ప్రకటించగానే ఎవరూ నమ్మలేదు. అందుకే ఈ డేట్ ను జక్కన్న చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడట. ఎలాగైనా ఈ డేట్ మిస్ అవ్వకూడదని కసిగా షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఒక్క పోస్టర్ కూడా ఇప్పటిదాకా అధికారికంగా విడుదల చేయలేదు. ఒక్క ఆర్ ఆర్ ఆర్ అని ఉన్న పోస్టర్ తప్ప ఏదీ విడుదల చేయలేదు. దసరా లేదా దీపావళికి ఫస్ట్ లుక్ వస్తుంది అనుకుంటే ఇరు హీరోల అభిమానులకి నిరాశే ఎదురైంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలని రాజమౌళి డిసైడ్ అయ్యాడట. జనవరి 1న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారు. ఇద్దరు హీరోలు కలిసి ఉన్న పోస్టర్, తర్వాత ఇద్దరూ విడివిడిగా ఉన్న పోస్టర్స్ ను విడుదల చేస్తారట. ఇప్పటికే ఈ పోస్టర్స్ ఎలా ఉండాలో డిజైన్ ఇచ్చేశాడట రాజమౌళి. మరి ఆ పోస్టర్స్ ఎలా ఉంటాయా అని అభిమానులు ఇప్పటినుండే తెగ వెయిట్ చేస్తున్నారు.