రియ‌ల్ స్టంట్స్‌కి జేజ‌మ్మ రెడీ!


రియ‌ల్ స్టంట్స్‌కి జేజ‌మ్మ రెడీ!
రియ‌ల్ స్టంట్స్‌కి జేజ‌మ్మ రెడీ!

`అరుంధ‌తి` సంచ‌ల‌న విజ‌యం త‌రువాత మ‌హిళా ప్ర‌ధాన చిత్రాల‌కు అనుష్క కెరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. ఆ త‌రువాత ఆమెని దృష్టిలో పెట్టుకుని ద‌ర్శ‌కులు ఆమ‌కు త‌గ్గ పాత్ర‌ల్ని రాయ‌డం మొద‌లుపెట్టారు. ఇటీవ‌ల `భాగ‌మ‌తి` ఆక‌ట్టుకున్న అనుష్క కొంత విరామం త‌రువాత `నిశ్శ‌బ్దం` చిత్రంలో న‌టిస్తున్నారు. హేమంత్ మ‌ధుక‌ర్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో మాధ‌వ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. కోన వెంక‌ట్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నారు. వ‌చ్చే ఏడాది ప్ర‌ధ‌మార్థంలో రిలీజ్ కానుంది.

ఇదిలా వుంటే అనుష్క మ‌రో మ‌హిళా ప్ర‌ధాన చిత్రానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. `బాహుబ‌లి` త‌రువాత నుంచి సినిమాల ఎంపిక విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న అనుష్క తాజాగా గౌత‌మ్ మీన‌న్ చిత్రానికి ఓకే చెప్పిన‌ట్టు తెలిసింది. అరుంథ‌తిలో జేజ‌మ్మ‌గా, బాహుబ‌లిలో దేవ‌సేన‌గా, భాగ‌మ‌తిలో చంచ‌ల‌గా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో ఆక‌ట్టుకున్న అనుష్క మ‌రో సారి అదే త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని తెలిసింది. గౌత‌మ్ మీన‌న్ ఓ ప‌వర్‌ఫుల్ క‌థ‌తో ఓ సినిమాని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. ఇందులో అనుష్క పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా వుంటుంద‌ని, ఇందులో ఆమె ఫైట్స్ కూడా చేస్తుంద‌ని తెలిసింది.

అయితే ఈ యాక్ష‌న్ డ్రామాలో అనుష్క ఎలాంటి డూప్ లేకుండా స్టంట్స్ చేయ‌బోతోంద‌ని వినిపిస్తోంది. జ‌న‌వ‌రి నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంద‌ని, మ‌రో కీల‌క పాత్ర‌లో బిగ్‌బాస్ ఫేమ్ అభిరామి న‌టించ‌నుంద‌ని తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల్ని చిత్ర బృందం లేదా దర్శ‌కుడు గౌత‌మ్‌మీన‌న్ ప్ర‌క‌టించ‌నున్నార‌ట‌. గౌత‌మ్ మీన‌న్ తొలిసారి ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో `క్వీన్‌` వెబ్ సిరీస్‌ని రూపొందించిన విష‌యం తెలిసిందే.