
అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ప్రత్యేకమైన సినిమా. తన టాలెంట్ ఏంటో ప్రపంచానికి తెలియజెప్పిన చిత్రం. అర్జున్ రెడ్డి ఎఫెక్ట్ అటు ప్రేక్షకుల మీద ఇటు విజయ్ దేవరకొండ మీద బలంగా పడింది. పది చిత్రాలకు సరిపడా ఎఫెక్ట్ ను ఒక్క సినిమాతో విజయ్ అనుభవించాడు. దేశవ్యాప్తంగా ఎనలేని క్రేజ్ ను తెచ్చిపెట్టిన ఈ చిత్రం ఇప్పుడు విజయ్ పై నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తోందని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు.
విజయ్ ప్రేమకథలతోనే హిట్ల మీద హిట్లు కొట్టాడు. అయితే ఇకపై ప్రేమకథలు చేయనని వరల్డ్ ఫేమస్ లవర్ రిలీజ్ కు ముందు అభిప్రాయపడ్డాడు. అప్పుడు ఆ నిర్ణయం అందరికీ కొత్తగా అనిపించింది. ఎందుకని విజయ్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు అనుకున్నారు. ప్రేమకథలతోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ ఇకపై అవి చేయకపోతే ఎలా అన్న అభిప్రాయానికి వచ్చేసారు. అయితే వరల్డ్ ఫేమస్ లవర్ విడుదలయ్యాక ఆ నిర్ణయమే సరైనదని అనిపిస్తోంది. విజయ్ ఇకపై ప్రేమకథలకు కొంత బ్రేక్ ఇస్తే మంచిదనే ఫీలింగ్ కు వచ్చేసారు ప్రేక్షకులు.
దానికి ప్రధాన కారణం అర్జున్ రెడ్డినే. ప్రేమలో ఉన్నప్పుడు విరహం కూడా చూపించాల్సి వస్తుంది. అయితే విజయ్ సినిమాల్లో కొంచెం గెడ్డం పెంచినా, కొంత బాధపడినా, ప్రేమ తాలూకు విరహం అనుభవించినా, కొంచెం గట్టిగా హీరోయిన్ పేరుని పిలిచినా ఆటొమ్యాటిగ్గా అర్జున్ రెడ్డి గుర్తుకు వస్తోంది. గతేడాది విడుదలైన డియర్ కామ్రేడ్ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఈ సినిమాకు మొదటి రోజు మిక్స్డ్ రెస్పాన్స్ రావడానికి ప్రధాన కారణం అర్జున్ రెడ్డి. ఇందులో మరో మాటకు సందేహం లేదు.
శీనయ్య, సువర్ణల ఉపకథ చాలా ఎఫెక్టివ్ గా తెరకెక్కింది. ఎందుకంటే అందులో శీనయ్య పాత్ర మాత్రమే కనిపించింది. సువర్ణ పాత్ర పడే బాధకు ప్రేక్షకులు కనెక్ట్ కాగలిగారు. అయితే మెయిన్ కథ అయిన గౌతమ్ – యామినిలను చూస్తుంటే అర్జున్ రెడ్డి-ప్రీతిలే ప్రేక్షకులకు స్ఫురణకు వచ్చారు. ఇక కనెక్ట్ అయ్యే స్కోప్ ఎక్కడిది?.