అర్జున్ సురవరం.. ఆ సినిమాల సరసన నిలిచిందే!


 

Arjun Suravaram becomes silent hit in Tollywood
Arjun Suravaram becomes silent hit in Tollywood

నిఖిల్ హీరోగా నవంబర్ 29న విడుదలైన అర్జున్ సురవరం విడుదలకు ముందు ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. అసలు ఈ సినిమా విడుదలైతే చాలు అనుకునే పరిస్థితి అప్పట్లో. అయితే ఈ సినిమా విడుదలవ్వడమే కాకుండా సూపర్ డూపర్ హిట్ స్థాయికి చేరుకుంది. లాస్ట్ వీకెండ్ ఎక్కువ ఆక్యుపెన్సీ ఉన్న చిత్రాల్లో బిగిల్ మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో ఉన్నది అర్జున్ సురవరమే కావడం విశేషం. ఇది దేశవ్యాప్తంగా మల్టిప్లెక్స్ లలో ఉన్న ఆక్యుపెన్సీ ఆధారంగా తీసిన రిపోర్ట్. దీని బట్టి అర్జున్ సురవరం హవా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికీ వీకెండ్స్ లో 60 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతోంది. ఈ విషయంపై నిఖిల్ సూపర్ హ్యాపీగా ఉన్నాడు. అసలు ఆశలు వదిలేసుకున్న చిత్రం ఇలా అందరి అంచనాలను దాటి పెర్ఫార్మ్ చేయడంతో ట్రేడ్ కూడా సూపర్ హ్యాపీ. డిసెంబర్ 13 వరకూ పెద్ద సినిమాలేవీ లేక విలవిలలాడుతున్న థియేటర్లలో అర్జున్ సురవరం తన హవాను చూపెట్టింది.

అసలు అర్జున్ సురవరం గతేడాది విడుదల కావాల్సిన సినిమా. కానీ అనుకోకుండా కొన్ని సమస్యలు చుట్టుముట్టడంతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ పోయింది. ఒక దశలో ఇక విడుదల కాదు అని కూడా అనుకున్నారు. నిఖిల్ కూడా ఈ సినిమా గురించి ఇక ఆలోచించడం మానేసి, తన సూపర్ హిట్ చిత్రం కార్తికేయకు సీక్వెల్ కార్తికేయ 2 పనుల్లో బిజీ అయిపోయాడు. అయితే ఇలా ఆగిపోయిన చిత్రాన్ని అల్లు అరవింద్ తన బిజినెస్ మైండ్ పెట్టి రిలీజ్ అయ్యేందుకు సహకరించారు. ఈ సినిమా డిజిటల్ హక్కులు రాయించుకోవడంతో పాటు నిఖిల్ నెక్స్ట్ సినిమా తనతో చేసేలా డీల్ సెట్ చేసుకుని రిలీజ్ కు ఉన్న అడ్డంకుల్ని తొలగించాడు. సో అలా అర్జున్ సురవరం కథ సుఖాంతమైంది.

ఒకసారి రీసెంట్ టాలీవుడ్ హిస్టరీ చూసుకుంటే.. స్టేల్ అయిపోయిన చిత్రాలకు సాధారణంగా ఆదరణ తక్కువగా ఉంటుంది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ రిలీజ్ కాకుండా ఆగిపోయిన చిత్రాలకు బజ్ తగ్గిపోతుంది. ప్రేక్షకులకు కూడా ఆసక్తి సన్నగిల్లుతుంది. 2018లో ఇలా రెండు చిత్రాలు వచ్చాయి. ఒకటి అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన భాగమతి. ఈ సినిమా మూడేళ్లకు పైగా షూటింగ్ లోనే గడిపేసింది. రిలీజ్ కు కూడా ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొంది. ఫైనల్ గా జనవరి 26న విడుదలై సంచలన విజయం సాధించింది. ఇక విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా సినిమా అయితే రిలీజ్ అడ్డంకులతో పాటు విడుదలకు ముందే పైరసీ కూడా వచ్చేసింది. దీంతో హుటాహుటిన విడుదల చేసారు. నిజానికి సినిమా యూనిట్ కు ఈ చిత్రం మీద అప్పుడు ఆశలు లేవు. సినిమా విడుదలైతే చాలనుకున్నారు. ఇది కూడా అంచనాలను తలకిందులు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాల సరసన అర్జున్ సురవరాన్ని కూడా చేర్చారన్నమాట. రిలీజ్ అడ్డంకులు ఉన్నా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమాలు ప్రూవ్ చేసాయి.