ఈ వారం సినిమాలు, అర్జున్ సురవరాన్ని ఆపగలవా?ఈ వారం సినిమాలు, అర్జున్ సురవరాన్ని ఆపగలవా?
ఈ వారం సినిమాలు, అర్జున్ సురవరాన్ని ఆపగలవా?

నిఖిల్ నటించిన అర్జున్ సురవరం ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే ప్రభావం చూపిస్తోంది. అయితే ఈ సినిమాకు ఎదురైనన్ని కష్టాలు ఇటీవలే కాలంలో మరే సినిమాకీ ఎదురై ఉండవు. సమయానికి సినిమా అవ్వక, ఎప్పుడు అవుతుందో క్లారిటీ లేక, అర్జున్ సురవరం ద్వారా నిఖిల్ నరకమే చూసాడు. దాదాపు ఏడాది పాటు వాయిదా పడిందీ చిత్రం. ఆ సమయంలో బాగా డిప్రెషన్ లోకి కూడా వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు నిఖిల్. ఈయన ఫ్యాన్స్ అయితే సినిమా మీద ఆశలు వదిలేసుకున్నారు. సాధారణంగా ఇలా వాయిదాలు పడుతూ రిలీజ్ కాని సినిమాలు తర్వాత విడుదలైనా పెద్దగా ఆడవు. అందుకే అర్జున్ సురవరం అద్భుతాలు కాదు కానీ పెద్ద ఆడేస్తుంది అని కూడా అనుకుని ఉండరు.

అయితే సినిమా రిలీజ్ కు ముందు చిరంజీవిని తీసుకొచ్చి సినిమాకు హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. నిఖిల్ కు ఉన్న సాఫ్ట్ ఇమేజ్, వాయిదా పడిందనే సాఫ్ట్ కార్నర్ ఇవన్నీ సినిమాకు పనిచేశాయనిపిస్తుంది. నిజానికి అర్జున్ సురవరం విడుదలయ్యాక మిక్స్డ్ టాక్ వచ్చింది. క్రిటిక్స్ కూడా యావరేజ్ రేటింగులే ఇచ్చారు. కానీ అర్జున్ సురవరం తొలి వీకెండ్లో దాదాపు 60 శాతానికి మించి వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. వీక్ డేస్ లో కూడా అదే జోరు చూపించిన అర్జున్ సురవరం నిన్నటితో ఫస్ట్ వీక్ ను కంప్లీట్ చేసుకుంది. అంతే కాకుండా పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి రాబట్టగలిగింది. తొలి వీక్ ముగిసేసరికే అటు నిర్మాతలు, ఇటు బయ్యర్లు అందరూ హ్యాపీ. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే అర్జున్ సురవరం సూపర్ హిట్ స్టేటస్ అందుకోవడం ఖాయం.

కానీ ఈరోజు అరడజనుకు పైగా సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ అందులో పేరున్నవి రెండే రెండు. ఒకటి కార్తికేయ హీరోగా చేసిన 90ml, శ్రీనివాస రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందిన భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు. అయినా కూడా ఈ రెండు సినిమాలపై బజ్ అంతగా లేదు. తొలిరోజు టాక్ బట్టి వసూళ్లు రాబట్టుకోవాల్సిందే. ఇక ఈ రెండింటితో పాటు మిస్ మ్యాచ్, అశ్వమేథం అంటూ మరో రెండు చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. కానీ వీటి గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.

మరి ఈ చిన్న సినిమాలు, అర్జున్ సురవరం ధాటిని తట్టుకుని నిలబడగలవా, అలాగే చిన్న సినిమాల తాకిడిని అర్జున్ సురవరం ఏ మేరకు నిలువరించగలదు అన్నది చూడాలి.