భాగమతి దర్శకుడు జాక్ పాట్ కొట్టాడు


భాగమతి దర్శకుడు జాక్ పాట్ కొట్టాడు
భాగమతి దర్శకుడు జాక్ పాట్ కొట్టాడు

గతేడాది ఏమాత్రం అంచనాల్లేకుండా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాల్లో భాగమతి కూడా ఒకటి. ఆ సినిమా ఆ రేంజ్ హిట్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. కారణం ఆ చిత్ర దర్శకుడు అశోక్ జి. ఒక కొరియన్ మూవీకి కాపీగా తెరకెక్కిన పిల్ల జమిందార్ సినిమా హిట్టయినా దాని వల్ల వచ్చిన పెద్దగా ఒరిగిందేమి లేదు. దానికి తోడు అశోక్ తెరకెక్కించిన సుకుమారుడు దారుణమైన ప్లాప్ గా మిగిలింది. అదే ప్లాప్ అనుకుంటే దాని తర్వాత వచ్చిన చిత్రాంగద ఇంకా పెద్ద ప్లాప్ గా మిగిలింది. అసలు ఈ సినిమా వచ్చినట్లే చాలా మందికి తెలీదు. ఇన్ని పరాజయాల తర్వాత కూడా అశోక్ కి భాగమతి సినిమా అవకాశం వచ్చింది.

థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన భాగమతి సర్ప్రైజ్ హిట్ అయింది. ఈ సినిమా హిట్టయినా కానీ అశోక్ మరో సినిమాను పట్టుకోవడంలో విఫలమయ్యాడని అంతా అనుకున్నారు. ఏదో ఫ్లూక్ లో భాగమతి హిట్టైపోయింది కాబట్టి మరో సినిమా ఇవ్వడానికి నిర్మాతలు జంకుతున్నారు అన్నది వాళ్ళ వాదన. సాయి ధరమ్ తేజ్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి కానీ అవి వార్తల వద్దే ఆగిపోయాయి. అయితే అశోక్ ఇప్పుడు అదిరిపోయే ఆఫర్ తో అందరికీ షాక్ ఇచ్చాడు. టాలీవుడ్ లో కాకుండా ఏకంగా బాలీవుడ్ లో సినిమా ఛాన్స్ కొట్టేసాడు.

అక్షయ్ కుమార్ సమర్పణలో భూషణ్ కుమార్ నిర్మించనున్న ఒక సినిమాకు అశోక్ జి దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఇక్కడ తెలుగులో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు అనుకుంటే ఏకంగా బాలీవుడ్ లో ఆఫర్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ చిత్రం భాగమతి చిత్రానికి రీమేక్ గా తెరకెక్కనుంది. దుర్గావతి అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారు. భూమి పెడ్నేకర్ ను కథానాయికగా ఎంచుకున్నారు. ఈ సినిమా కనుక హిట్ అయితే ఇక బాలీవుడ్ లో అశోక్ పాగా వేసేయొచ్చు. మంచి ప్రొడక్షన్ హౌజ్ లో ఆఫర్ కాబట్టి ఇక వెనుతిరిగిచూడాల్సిన అవసరం లేదు. మరి చూద్దాం అశోక్ ఏం చేస్తాడో.