`అసుర‌న్‌` రీమేక్‌కి ముహూర్తం ఫిక్స‌యింది!


Asuran Movie Remake Opening Date Out
Asuran Movie Remake Opening Date Out

ధ‌నుష్‌, మంజు వారియ‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ చిత్రం `అసుర‌న్‌`. వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో క‌లైపులి ఎస్ థాను నిర్మించిన ఈ చిత్రం త‌మిళ నాట సంచ‌ల‌నం సృష్టిస్తోంది. కుల వ్య‌వ‌స్థ నేప‌థ్యంలో రా కంటెంట్‌తో వాస్త‌విక కోణంలో తెర‌కెక్కించిన ఈ సినిమాలో ధ‌నుష్ పోషించిన పాత్ర‌కు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు ల‌భిస్తున్న విష‌యం తెలిస‌పిందే. అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్‌తో ధ‌నుష్ న‌ట‌న ప‌లువురిని ఆక‌ట్టుకుంది. త‌మిళ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాల‌ని సురేస్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత డి. సురేష్‌బాబు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ చిత్ర తెలుగు రీమేక్ హ‌క్కుల్ని సొంతం చేసుకున్న ఆయ‌న తెలుగు నేటివిటీకి అనుగుణంగా క‌థ‌లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. కుల ప్ర‌స్థావ‌న, అందుకు త‌గ్గ అంశాల‌ని తెలుగు రీమేక్‌లో కొంత వ‌ర‌కు త‌గ్గించి ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. ఇందులో హీరో వెంక‌టేష్ న‌టించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ధ‌నుష్ పోషించిన పాత్ర‌లో వెంక‌టేష్‌ని ఊహిస్తూ ఫ్యాన్స్ మార్ఫింగ్ చేసిన ఫొటోలు సోష‌ల్ మీడిమాలో వైర‌ల్‌గా మారాయి. ప‌క్కా నేటివిటీ గల పాత్ర‌లో వెంక‌టేష్ న‌టించ‌నున్న ఈ చిత్రాన్ని శ్రీ‌కాంత్ అడ్డాల తెర‌కెక్కించ‌బోతున్నారు.

ఇప్ప‌టికే స్ర్కిప్ట్‌లో తెలుగు వాతావ‌ర‌ణానికి అనుగుణంగా ప‌లు మార్పులు చేసిన శ్రీ‌కాంత్ అడ్డాల ఫైన‌ల్ స్ర్కిప్ట్‌ని లాక్ చేసి ప్రి ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌లో బిజీ అయిపోయిన‌ట్టు తెలుస్తోంది. వెంక‌టేష్‌ని కొత్త త‌ర‌హా పాత్ర‌లో ప్ర‌జెంట్ చేయ‌బోతున్న ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి నుంచి సెట్స్‌పైకి తీసుకురావాల‌ని చిత్ర బృందం ముహూర్తం ఫిక్స్ చేసిన‌ట్లుఏ నిర్మాత డి. సురేష్‌బాబు సోమ‌వారం ప్ర‌క‌టించారు. ఈ చిత్రంలో సురేష్‌బాబు చిన్న కుమారుడు అభిరామ్ న‌టిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అందులో ఎలాంటి వాస్త‌వం లేద‌ని సురేష్ బాబు తేల్చి చెప్పారు.