వెంకీ అసురన్ మొదలయ్యేది అప్పుడే!


వెంకీ అసురన్ మొదలయ్యేది అప్పుడే!
వెంకీ అసురన్ మొదలయ్యేది అప్పుడే!

విక్టరీ వెంకటేష్ హీరోగా ఈ ఏడాది మంచి ఫలితాలనే అందుకున్నాడు. ఈ ఏడాది చేసిన రెండు సినిమాలతో హిట్లు కొట్టాడు. ఈ రెండూ మల్టీస్టారర్ సినిమాలే అవ్వడం విశేషం. ఇక్కడ మరో కామన్ పాయింట్ ఏంటంటే ఈ రెండు సినిమాల్లో కూడా వెంకీ పాత్రే హైలైట్ అయింది. ఈ రెండూ వెంకటేష్ వరుణ్ తేజ్ తో కలిసి చేసిన ఎఫ్ 2 కాగా, మరోకటి నాగ చైతన్యతో కలిసి చేసిన వెంకీ మామ. ఈ రెండు సినిమాల్లో మరో కామన్ పాయింట్ ఎంటర్టైన్మెంట్. ఈ ఏడాది అంతా కామెడీ, ఫ్యామిలీ డ్రామాలతో గడిపేసిన వెంకటేష్ వచ్చే ఏడాది ఒక హై ఇంటెన్సిటీ ఉన్న కథ చేయబోతున్నాడు. తమిళంలో ధనుష్ హీరోగా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన అసురన్ రీమేక్ లో వెంకటేష్ నటిస్తోన్న విషయం తెల్సిందే.

వెంకటేష్.. ధనుష్ పాత్రలో చేయనుండగా మిగిలిన కీలక పాత్రలకు కొత్త ముఖాలను ఎంపిక చేయనున్నట్లు కొన్ని వారాల క్రితం ప్రొడక్షన్ హౌస్ ప్రకటించిన విషయం తెల్సిందే. సురేష్ బాబు ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించనున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించిన కలైపులి ఎస్ థాను ఇక్కడ సహనిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్నాడని ప్రకటించారు. ఇప్పటిదాకా సాఫ్ట్ తరహా చిత్రాలనే తెరకెక్కిస్తూ వచ్చిన శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని ఏ విధంగా డైరెక్ట్ చేయనున్నాడోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ ఏంటంటే.. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జనవరి 2 నుండి మొదలుకాబోతోందిట. అప్పుడే ఇందులో నటించే ప్రధాన పాత్రధారులెవరూ అన్న విషయం తెలియజేస్తారు. సాంకేతిక నిపుణుల వివరాలు కూడా అప్పుడే రివీల్ చేయనున్నారు. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోనే మొదలుకానుందని తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసి వేసవి చివరికి విడుదల చేయాలని భావిస్తున్నారు.