ఎన్టీఆర్ తో సినిమాపై హింట్ ఇచ్చిన అట్లీ


ఎన్టీఆర్ తో సినిమాపై హింట్ ఇచ్చిన అట్లీ
ఎన్టీఆర్ తో సినిమాపై హింట్ ఇచ్చిన అట్లీ

రాజా రాణి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు అట్లీ కుమార్. ఈ చిత్రం తమిళంలోనే కాక తెలుగులో కూడా పెద్ద హిట్టైంది. ఇప్పటికీ ఈ చిత్రంలోని పాటలను వింటుంటారు తెలుగు శ్రోతలు. ఈ సినిమాతో అట్లీ ఏకంగా తమిళ్ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేసే అవకాశాన్ని పొందాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూనే తేరి చిత్రాన్ని తెరకెక్కించాడు. అది కూడా సూపర్ హిట్ అయింది. తెలుగులో పోలీసోడు పేరుతో విడుదలై ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక అట్లీ మూడో సినిమా మెర్సల్. అది బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం తెలుగులో అదిరింది పేరుతో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.

ఇలా అట్లీ కెరీర్ హ్యాట్రిక్ విజయాలతో ఉండగా ముచ్చటగా మూడోసారి విజయ్ తో సినిమాను తెరకెక్కించాడు. అదే బిగిల్. ఫుట్ బాల్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు ఈ నెల 25న రానుంది. తెలుగులో ఈ చిత్రం విజిల్ పేరుతో విడుదలవుతోంది. ట్రైలర్, ప్రోమోలు అన్నీ కూడా ఆసక్తికరంగా, సినిమాపై అంచనాలు పెంచే విధంగానే ఉన్నాయి. విజిల్ లో విజయ్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. మైఖేల్, రాజప్ప, బిగిల్.. అయితే ఒకే పాత్ర మూడు పాత్రలుగా కనిపిస్తుందా లేక త్రిపాత్రాభినయమా అన్నది తెలియాల్సి ఉంది.

ఈరోజు విజిల్ ప్రెస్ ఈవెంట్ జరిగింది. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి దర్శకుడు అట్లీ వచ్చాడు. స్పీచ్ మొదలుపెట్టడమే అట్లీ అందరి దృష్టిని ఆకర్షించాడు. అందరిలాగే అందరికీ నమస్కారం అంటూ మొదలుపెట్టి.. నాకు తెలుగులో సినిమా చేయాలని ఉంది. త్వరలోనే తెలుగులో స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తాను అని అన్నాడు. దానికి ప్రేక్షకుల్లో నుండి ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటూ అరుస్తూ గోల చేసారు. దానికి అట్లీ నవ్వుతూ అవును, అన్నీ కుదిరితే త్వరలోనే ఉంటుంది అని చెప్పాడు. దీన్ని బట్టి అట్లీ – ఎన్టీఆర్ సినిమా కన్ఫర్మ్ అనుకోవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ పూర్తవ్వగానే అట్లీ – ఎన్టీఆర్ సినిమా ఉంటుందని అంటున్నారు.

ఇక అట్లీ తన స్పీచ్ లో తెలుగు వారిని ఉద్దేశిస్తూ తెగ పొగిడేసాడు. ఇక్కడినుండి నాకు ఎంతో ప్రేమ వస్తుంది. తెలుగులో దాదాపు 700 స్క్రీన్లలో విజిల్ చిత్రం విడుదలవుతోంది. నిజంగా ఇది చాలా సంతోషకరం. తెలుగువారు ఇంత ప్రేమ ఇస్తున్నందుకైనా నేను తెలుగులో డైరెక్ట్ గా తెలుగు సినిమా చేయాలనుకుంటున్నాను. నా సినిమా విడుదలైన ప్రతీ సారి ఎన్టీఆర్ గారు నాకు ఫోన్ చేసి సినిమా బాగుందని అభినందిస్తూ ఉంటారు. నాకు అది చాలా ఆనందాన్నిస్తుంది అన్నాడు.

విజిల్ మహిళలకు డేడికేట్ చేస్తున్నామని, అసలు ఈ కథ వారిని దృష్టిలో పెట్టుకుని చేసిందేనని, ఫుట్ బాల్ నేపథ్యం సరికొత్తగా ఉంటుందని అట్లీ అభిప్రాయపడ్డాడు. రెహమాన్ సంగీతంపై కూడా అట్లీ ప్రశంసలు కురిపించాడు. చివరిగా విజయ్ గురించి చెబుతూ ఆయన లేకపోతే నేను లేనని, ఈరోజు అట్లీ ఉన్నాడంటే దానికి కారణం విజయ్ సర్ అని ముగించాడు అట్లీ.

విజిల్ విశేషాలు పక్కనపెడితే ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం అట్లీ తమ అభిమాన హీరోతో సినిమా చేయనున్నాడన్న వార్త బాగా రిజిస్టర్ అయింది. మరోవైపు అట్లీ షారుఖ్ ఖాన్ తో కూడా సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఏ చిత్రం ముందు మొదలవుతుందో తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు.