జగన్ తో మీటింగ్ కు కూడా నన్ను పిలవలేదు : బాలయ్యజగన్ తో మీటింగ్ కు కూడా నన్ను పిలవలేదు : బాలయ్య
జగన్ తో మీటింగ్ కు కూడా నన్ను పిలవలేదు : బాలయ్య

తెలంగాణ సీఎం కేసీఆర్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంత మంది ప్రముఖులు కలిసి కీలకమైన విషయాలను చర్చించిన సంగతి తెల్సిందే. వీలైనంత తొందర్లో సినిమా షూటింగ్ లను మొదలుపెట్టాలని చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, అల్లు అరవింద్, సి. కళ్యాణ్ వంటి వారు కేసీఆర్ ను కలిసి విన్నవించుకున్నారు. అయితే ఈ మీటింగ్ కు తనను దూరం పెట్టడంపై నందమూరి బాలకృష్ణ అలిగిన విషయం తెల్సిందే. హైదరాబాద్ లో భూములు పంచుకోవడానికి ఈ మీటింగ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసాడు కూడా.

అయితే నిర్మాత సి. కళ్యాణ్ ఇటీవలే మాట్లాడుతూ జూన్ 9న మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ ఉందని, దానికి బాలకృష్ణను ఆహ్వానించామని, అయితే ఆయన పుట్టినరోజు వేడుకల వలన రావట్లేదని తెలిపాడు. ఇప్పుడు దానికి భిన్నంగా బాలకృష్ణ స్పందించడం విశేషం.

జూన్ 9న మీటింగ్ కు కూడా తనను ఎవరూ పిలవలేదని, అయినా తనకు వెళ్లే ఉద్దేశం కూడా లేదని, దాని వల్ల ఒరిగేదేమి ఉండదని ఆయన అన్నాడు. ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉంటే జగన్ ను కలిసి ఉపయోగమేంటో నాకు అర్ధం కావడం లేదు. బహుశా అది ఫిల్మ్ స్టూడియోల కోసం అయ్యుంటుంది. నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. నా వరకూ టాలీవుడ్ అంతా ఒకసారి కలిసి కూర్చుని సమస్యల గురించి మాట్లాడుకుంటే బాగుంటుందని ఉంది. ఇప్పుడు దృష్టి అంతా కరోనాను ఎలా ఎదుర్కోవాలి, వర్కర్స్ కు ఎలా సహాయపడాలి వంటివాటి మీద ఉండాలి. షూటింగ్ లు ఇప్పుడప్పుడే మొదలయ్యే అవకాశాలు లేవు అని బాలకృష్ణ తెలిపాడు.