బాలయ్యకు ప్లాప్ ఇచ్చిన దర్శకుడు.. మళ్ళీ వచ్చాడు!

బాలయ్యకు ప్లాప్ ఇచ్చిన దర్శకుడు.. మళ్ళీ వచ్చాడు!
బాలయ్యకు ప్లాప్ ఇచ్చిన దర్శకుడు.. మళ్ళీ వచ్చాడు!

సినిమాలన్నాక హిట్లు, ప్లాప్ లు సర్వ సాధారణం. అయితే కొన్ని సినిమాలు ఎందుకు తీశార్రా బాబు అనిపిస్తాయి. అలాంటి సినిమాలకు పనిచేస్తే ఎవరి కెరీర్ అయినా గల్లంతవ్వడం ఖాయం. శ్రీకాంత్ అడ్డాలకు బ్రహ్మోత్సవంలాగా అన్నమాట. అప్పటిదాకా ఎన్ని మంచి సినిమాలు తీసినా బ్రహ్మోత్సవం అనే ఒకే ఒక్క సినిమాతో శ్రీకాంత్ అడ్డాల అడ్రస్ లేకుండా పోయాడు. మళ్ళీ ఇన్నేళ్లకు ఒక రీమేక్ చిత్రంతో తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మరి ఈ సినిమా అతని ఫేట్ ను ఏ విధంగా మారుస్తుందో చూడాలి.

ఈ విషయం పక్కనపెడితే, ,పరుచూరి మురళి అనే దర్శకుడు గుర్తున్నాడా? అతని తొలి చిత్రం నీ స్నేహం పెద్ద ప్లాపైంది. అయినా కానీ ఆ తర్వాత చేసిన పెదబాబు, ఆంధ్రుడు రీజనబుల్ సినిమాలు అనిపించాయి. నిజానికి అవేమంత హిట్స్ కాకపోయినా పరుచూరి మురళికి చెడ్డ పేరు అయితే తీసుకురాలేదు. కెరీర్ లో ఒక్క సూపర్ హిట్ కూడా తీయని మురళికి నందమూరి బాలకృష్ణ పిలిచి మరీ అవకాశమిచ్చాడు. ఏడేళ్ల క్రితం విడుదలైన అధినాయకుడు సినిమాతో వీరిద్దరూ కలిసి పనిచేసారు. అయితే ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందించిందో మనందరం చూసాం.

అయితే ఆ తర్వాత మళ్ళీ మరే సినిమా చేయలేకపోయాడు మురళి. ఏడేళ్ల తర్వాత మళ్ళీ రూలర్ సినిమాకు తేరా వెనుక కనిపించాడు. రూలర్ సినిమాకు కెఎస్ రవికుమార్ దర్శకుడు, ఇందులో పరుచూరి మురళికి ఏంటి సంబంధం అని సందేహించిన వాళ్ళకి ఇటీవలే విడుదలైన ట్రైలర్ తో సమాధానం దొరికినట్లయింది. రూలర్ ట్రైలర్ చూస్తే అందులో క్రెడిట్స్ కింద కథ, మాటలు విభాగంలో పరుచూరి మురళి పేరు కనిపిస్తుంది. అంటే తనకు అంత పెద్ద ప్లాప్ ఇచ్చినా కానీ బాలకృష్ణ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడన్నమాట.

అయితే పరుచూరి మురళి రెండు డీసెంట్ సినిమాలు తీసినా అవి కొంచెం ఓల్డ్ ఫార్మాట్ లోనే ఉంటాయి. ట్రెండ్ కు తగ్గట్లు సినిమాలు చేయడు మురళి. రూలర్ ట్రైలర్ చూసినా కథ కానీ, డైలాగ్స్ కానీ కొంత రొటీన్ గా ఉన్నట్లే కనిపించింది. కానీ ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమాలా అయితే ఉంది. మరి రూలర్ తో బాలకృష్ణ నమ్మకాన్ని పరుచూరి మురళి నిలబెడతాడో లేదో చూడాలి.

రూలర్ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. అదే రోజు సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా రూలర్ కు ఎంతవరకూ ఎఫెక్ట్ అవ్వగలదో చూడాలి. రూలర్ లో బాలయ్య రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించనున్న విషయం తెల్సిందే. ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్రలోనూ, మరొకటి కార్పొరేట్ దిగ్గజం పాత్రలోనూ కనిపించనున్నాడు బాలకృష్ణ. వేదిక, సోనాల్ చౌహన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో భూమిక ఒక కీలక పాత్ర పోషించింది. సి. కళ్యాణ్ నిర్మాత. చిరంతన్ భట్ సంగీతాన్ని అందించాడు. త్వరలోనే పూర్తి ఆల్బమ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.